-
కాలుష్యం కట్టడిపై కేజ్రీ పూటకో మాట
-
యమున ప్రక్షాళన చేయలేక మాటలదాడి
-
ప్రత్యర్ధుల దృష్టి మళ్లించడానికి సంచలన ఆరోపణలు
-
ఆధారాలు ఇవ్వాలన్న ఈసీ
-
యమునా నీటినే తాను తాగుతున్నానన్నమోడీ
-
అదే నీటిని తాగి చూపించిన హర్యానా సీఎం
-
వీడియో వార్ తో సీన్ పతాక స్థాయికి
-
యమునా నది క్లీనింగ్ ఎప్పుడంటూ రాహుల్ ప్రశ్నలు
-
కేజ్రీ ఏదో చేయబోతే ఇంకేదో అయ్యిందా?
కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తానంటూ అధికారం చేపట్టిన ఆప్ ఆ పని చేయకపోగా అదే కాలుష్యానికి బలయ్యిందా? ఆప్ ఓటమి తీరు చూస్తే అదే అనిపిస్తుంది. ఢిల్లీ ప్రజలకు రక్షిత మంచినీరు అందిస్తామన్న కేజ్రీవాల్ అందుకు యమునా నదిని ప్రక్షాళన చేస్తామని రెండోసారి గెలిచినప్పుడు వాగ్దానం చేశారు. ఢిల్లీలో మామూలు మనుషులు బతికి బట్టకట్టలేనంతగా కాలుష్యం వెంటాడుతోంది.దీనికోసం మొదటిసారి గెలిచినప్పుడు సరి, బేసి విధానం లాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేజ్రీవాల్ రెండోసారి మాత్రం కాలుష్య నియంత్రణకు ఏమీ చేయలేకపోయారు.వాయు కాలుష్యానికి తోడు .. నీటి కాలుష్యం పెరిగిపోయింది.
దెబ్బ తీసిన ఎదురు దాడి వ్యూహం :
యమునానది ఢిల్లీ ప్రజలకు తాగు నీటి వనరు. ఆ నదిని ప్రక్షాళన చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ ఆ తర్వాత ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు.అవినీతి ఆరోపణలు వెంటాడుతుంటే ప్రజల దృష్టి మళ్లించడానికి యమునా నదిలో బీజేపి నేతలు విషం కలిపారంటూ ఎదురు దాడికి దిగారు. సంచలనమైన ఈ ఆరోపణలు ఆ తర్వాత ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఎన్నికల కమిషన్ దానిపై వివరణ కోరింది. ఆధారాలతో బయటపెట్టకపోతే జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించింది. అటు మోడీ అదే యమునా నీటిని తాను తాగుతున్నానంటూ చాలా సైలెంట్ గా గాలి తీసేశారు. మరోవైపు యమునా నది ప్రక్షాళన సంగతేంటి అంటూ రాహుల్ వెంటపడటం మొదలు పెట్టారు. పైగా యమునా నదిలో బోటు విహారం కూడా చేసిన రాహుల్ కేజ్రీవాల్ పై విమర్శల పదును పెంచారు. ఎక్కడి చెత్త అక్కడే. యమునా నది మురికి కూపంలా మారిందన్నారు.ఆ పాపమంతా కేజ్రీవాల్ దే అని తిట్టిపోశారు.
ఈసీ నోటీసులకు స్పందించిన కేజ్రీవాల్ అందుకు రిప్లయ్ గా 13 పేజీల డాక్యుమెంట్లను జత చేసి పంపారు.అందులో ఫిల్టర్ ప్లాంట్లలో అమ్మెనియా కాలుష్యం అసాధారణ స్థాయిలో కనిపించిందని ఆధారాలతో చూపారు. మరి విషం సంగతేంటి అంటూ బీజేపి నేతలు సెటైర్లు వేయడం మొదలు పెట్టారు.
యమున నది ఆరంభమైన హర్యానాలో బీజేపి నేతలు విషం కలిపారని మరోసారి కేజ్రీవాల్ దూకుడు పెంచారు. ఈసారి హర్యానా సీఎం నవాబ్ సైనీ స్వయంగా యమునా నదికి వెళ్లి ఆ నీటిని నోట్లో పోసుకుని ఆ వీడియో షేర్ చేశారు. అయితే సైనీ నీరు తాగలేదని, తిరిగి ఉమ్మేశారని కేజ్రీవాల్ మరో వీడియో షేర్ చేశారు. అయితే అది నకిలీదని తేలిపోయింది. ఇలా పోటా పోటీ వీడియో వార్ కేజ్రీవాల్ ను పలుచన చేసింది. మరోవైపు రాహుల్ కేజ్రీపై దూకుడు పెంచారు. యమునా నదిలో స్నానం ఎప్పుడు? దాని ప్రక్షాళన ఎప్పుడంటూ కేజ్రీవాల్‌ను మాటల తూటాలతో వెంటాడారు. యమున దాకా ఎందుకు ఢిల్లీ ట్యాప్ వాటర్ తాగండి.. ఇద్దరం ఆస్పత్రిలో కలుద్దాం అంటూ ఘాటైన సెటైర్ వేశారు. ఇలా కేజ్రీవాల్ ఎదురు దాడి వ్యూహం అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది.
సొంత నేతలు వారించలేదు :
అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అయిన ఆప్ ను సహచర నేతలైనా వారించలేదు. కనీసం ఇతర నేతలైనా ఆప్ అధినేతను కట్టడి చేయకుండా కేజ్రీవాల్ ఏదంటే దానిని సమర్ధించడంతో ఆప్ తనకు తానే డ్యామేజీ చేసేసుకుంది.చివరికి
యమున కాలుష్యభూతం కేజ్రీవాల్ ను కాటేసింది.