- కేజ్రీవాల్ ను ఓడించిన అవినీతి ఆరోపణలు
- బీజేపి బ్రహ్మాస్త్రాల ముందు ఆప్ వెలవెల
- గేంఛేంజర్ గా 12 లక్షల ఆదాయ పరిమితి వెసులుబాటు
- అమలుకానీ కేజ్రీ వాగ్దానాలు
- ఇంటా, బయటా సమస్యలతో కేజ్రీవాల్ ఉక్కిరి బిక్కిరి
ఢల్లీ గద్దెపై కాషాయ జెండా ఎగిరింది. హోరా హోరీ పోటీ… ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లో కూడా ఇంత ఉత్కంఠ ఉండదేమో. కొన్ని రౌండల్లో పదుల్లో, వందల్లో ఆధిక్యత, కొన్ని చోట్ల ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్. ఇలా దాగుడు మూతల మధ్య ఢిల్లీ ఫలితాలు ఎట్టకేలకి కమలం పరమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని ఓటమి ఖాయమని, బీజేపి ప్రభంజనం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆరంభంలో కరెక్టనే అనిపించినా కౌంటింగ్ మధ్యలోకి వచ్చే సరికి సీన్ తిరగబడింది. ఢిల్లీ ఓటర్ల మనోగతం రెండు పార్టీల మధ్య డోలాయమాన స్థితిని ఎదుర్కొందని కౌంటింగ్ లో ట్రెండ్స్ సరళి చూస్తే అర్ధమవుతుంది. ఆప్ పడుతూ లేస్తూ చివరి వరకూ గట్టి పోటీనే ఇచ్చింది. బీజేపి మార్క్ స్ట్రాటజీ అసలు పొల్లు పోదని మోడీ, షా కంబైన్డ్ స్ట్రాటజీ తప్పయ్యే ఛాన్సే లేదని కమల దళం ధీమాగా ఉన్నా సామాన్యుడి పార్టీ చాలా చోట్ల బీజేపికి ముచ్చెమటలు పట్టించింది. పదేళ్ల పాటు ఏకబిగిన అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత సహజమే అయినా కేజ్రీవాల్ కంచుకోటలను బద్దలు కొట్టడంలో బీజేపి సక్సెస్ అయ్యింది.
మొదట్లో ఉన్నంత పారదర్శకత లేకపోవడం, అవినీతి ఆరోపణలు, ఆమ్ ఆద్మీ కాస్తా సంపన్నుడిగా మారిపోవడం, లైఫ్ స్టైల్ మార్చేయడం… ఢిల్లీలో చివరి అయిదేళ్ల కాలంలో అనుసరించిన విధానాలు ఆయన కొంపముంచాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి పురుడు పోసుకున్న పార్టీ… విద్యావంతులు… నవతరం ప్రతినిధులు కలగలసి స్థాపించిన పార్టీ… సివిల్ సర్వెంట్ ఉద్యోగాన్ని వదులుకుని అవినీతిపై యుద్ధభేరి మోగించిన వ్యక్తి నాయకత్వంలో ప్రజల్లోకి వచ్చిన పార్టీ… ఆమ్ ఆద్మీ పార్టీపై భారత ప్రజానీకానికి ఉన్న ఇమేజ్ ఇది. ఈ ఇమేజ్‌తోనే ఆప్ వరుసగా రెండు పర్యాయాలు ఢిల్లీ రాష్ట్రంపై జెండా ఎగరేయడమే కాకుండా హర్యానా రాష్ట్రాన్ని కూడా కైవశం చేసుకోగలిగింది. అలాంటిది కేజ్రీ రెండో పర్యాయ పాలనలో ఆయనతో పాటు ఆయన క్యాబినేట్ సహచరులు సైతం అవినీతి ఊబిలో కూరుకు పోయి జైళ్ళ పాలవడం ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ ఫలితం ఇచ్చారు ఢిల్లీ ప్రజలు.
దానికి తోడు కేజ్రీవాల్ ను ఉక్కిరి బిక్కిరి చేయడంలో, బీజేపి పవర్ ప్లే బాగా పనిచేసింది. ఓ వైపు అవినీతి ఆరోపణలు,మరో వైపు పార్టీలో అసంతృప్తి.. మరో వైపు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లి రావడం, ఇక అన్నింటికన్నా ఢిల్లీలో పరిమిత అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉండటం అన్నీ వెరసి కేజ్రీవాల్‌ను ముంచేశాయి. చివరి మూడేళ్లలో సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేకపోవడం.. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడం ఆప్ చేతులకు సంకెళ్లు వేసింది.
అందుకే ప్రచారం అందరికన్నా ముందే ఆరంభించినా, భారీ ఉచితాలు ప్రకటించినా.. కేజ్రీవాల్ చివరిలో సంయమనం కోల్పోయి చేసిన ఆరోపణలు ఆయన కొంప ముంచాయి. యమున నీటిలో విషం కలిపారని,తనపై హత్యా యత్నం జరిగిందని, చేసిన ఆరోపణలు సామాన్యుడి తలకి ఎక్కలేదు సరికదా ఓటమి నైరాశ్యంలో చేసిన వ్యాఖ్యలుగానే పరిగణించారు. ఫలితాలని విశ్లేషిస్తే ఆప్ కు 44 శాతం ఓట్లు పోలవగా, బీజేపికి 46 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం రెండు శాతం మాత్రమే. కాంగ్రెస్ ఈసారి ఓటు శాతం ఓటింగ్ మాత్రమే సాధించి ఫ్లాప్ షోగా మిగిలిపోయింది.
ఆప్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సామాన్య జనానికి దూరమైపోయారు.
ఇండియా బ్లాక్ లో అనైక్యత.. కాంగ్రెస్ పోషించిన శకుని పాత్ర కూడా ఆప్ ను దెబ్బ కొట్టింది.12 లక్షల వరకూనో టాక్స్ అంటూ బీజేపి వేసిన బ్రహ్మాస్త్రం గేమ్ ఛేంజర్ గా పనిచేసింది. ఓవరాల్ గా చీపురును పక్కన పెట్టి కమలం వికసించింది. ఆప్ గౌరవ ప్రదమైన ఓటమితో బయటపడింది. మొత్తం 70 సీట్లున్న డిల్లీ అసెంబ్లీలో బీజేపికి 48 సీట్లు రాగా, ఆప్ కేవలం 22 సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్, ఇతరులు సోదిలోకి కూడా లేకుండా పోయారు.