33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

డ్వాక్రా సంఘాల్లా పురుషులకూ పొదుపు సంఘాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రయోగం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినప్పటికీ డ్వాక్రా సంఘాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అదే తరహాలో పురుషులకు కూడా స్వయం ఉపాధికి అండగా ఉండాలనే లక్ష్యంతో పురుషుల పొదుపు సంఘాలు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యేడాది ఏప్రిల్‌ నెలలో విజయవాడ, విశాఖపట్నంలో మూడువేల పురుషుల పొదుపు సంఘాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సర్కారు నిర్ణయం మేరకు జనవరిలోనే వెయ్యి పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయి. వచ్చే నెల మార్చి నాటికి మరో రెండువేల పొదుపు సంఘాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

వాస్తవానికి పురుషులలో పొదుపు అలవాటును పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం వీటికి రూపకల్పన చేస్తున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ -ఎన్ యూఎల్ఎం 2.0 కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 25నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణంలో పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. అయితే, గ్రామాల నుంచి నగరాలకు ఉపాధి కోసం తరలివస్తున్న కూలీలకు ఆర్థికంగా భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల పురుషుల్లో పొదుపు అలవాటు చేయించడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇప్పించి, అవసరమైన వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయబోతోంది. ముఖ్యంగా భవన నిర్మాణ పనులు చేసే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఫుడ్, వెజిటెబుల్స్‌, నిత్యావసరాలు డెలివరీ చేసే గిగ్ కార్మికులు, ఆటోలు, రిక్షాలు, తోపుడు బండ్లతో ఉపాధి పొందుతున్న కార్మికులతో పాటు.. వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో, ఇళ్లలో పనిచేసేవాళ్లు, వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు పురుషుల పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులుగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పొదుపు సంఘాలకు సంబంధించి ఒక్కో సంఘానికి గరిష్ఠంగా ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రతీనెలా సమావేశమై ఒక్కో సభ్యుడు తక్కువలో తక్కువగా రూ.100 చొప్పున పొదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదటిదశలో 2,841 పురుషుల పొదుపు సంఘాలను నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం టార్గెట్‌కు అనుగుణంగా ప్రజల నుండి కూడా అనూహ్య స్పందన లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే 1,028 పురుషుల సంఘాలు ఏర్పడడంతో, మార్చి 31 నాటికి తమ టార్గెట్ ను పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేశారు. ముఖ్యంగా పురుషుల పొదుపు సంఘాలతో రోజువారీ కూలీలతో పాటు.. భవన నిర్మాణ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే, పురుషుల పొదుపు సంఘాలలో చేరెందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది. 18 నుండి 60 ఏళ్ల మధ్యగల వయసు గలవారు అర్హులు. అలాగే, ఐదుగురు పురుషులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రూప్‌లో సభ్యుడిగా చేరే వ్యక్తి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రతినెలా కనీసం రూ.100 నుండి రూ.1000 దాకా పొదుపు చేసేందుకు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ పొదుపు సంఘానికి ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం.. రూ.25 వేలు అందజేస్తుంది. పొదుపు సంఘాలపై ఆసక్తి కలిగిన పురుషులు స్థానిక మెప్మా కార్యాలయ సిబ్బందిని సంప్రదిస్తే చాలు.. పురుషుల పొదుపు సంఘం గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. మూడు నెలల తరువాత పొదుపు మొత్తంపై ఆరు రెట్లు లేదా రూ.1.50 లక్షలు బ్యాంకుల ద్వారా రుణం రూపంలో అందిస్తారు. పొదుపు సంఘం సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. దేశ వ్యాప్తంగా 25 నగరాల్లో కేంద్రప్రభుత్వం పురుషుల పొదుపు సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ యేడాది అమలు చేయబోతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌నుంచి విజయవాడ, విశాఖ పట్నం ఉన్నాయి. అయితే, దశల వారిగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రెండో దశలో.. విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో పురుషు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, సంఘాల ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపుకోసం ఆయా జిల్లాల్లో త్వరలో సర్వే నిర్వహించనున్నట్లు మెప్మా అధికారులు తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com