అమెరికాకు సంబంధించిన ఒక్క డాలర్ కూడా ఇతరుల కోసం వేస్ట్ చేయవద్దు.. ఉచితంగా అస్సలే అందించవద్దు.. ఏం చేసినా అది అమెరికాకే లాభం కలగాలి.. అలా అయితేనే ఖర్చు చేయాలి.. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. అతని కార్యాచరణ కూడా అలానే ఉంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు 9,700 మంది ఉద్యోగాలు ఊడబోతున్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు పోయాయి కూడా. మరికొందరికి ఇప్పటికే నోటీసులు అందాయి.
యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అనే ఓ సంస్థ ఉంది. ఇందులో 10,000 మంది పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో చాలా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది ఈ సంస్థ. దీని కోసం వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంటుంది అమెరికా. కానీ ఇకపై అలా కుదరదు అని చెబుతున్నారు ట్రంప్. ఇప్పటికే సహాయ నిధిని నిలిపేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు సహాయ పనులే లేనప్పుడు అందులో ఉద్యోగులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ సంస్థలో 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వీరి సంఖ్యను 300కు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 9,700 మంది ఉద్యోగులపై వేటు పడనుంది.
ఆఫ్రీకాలో 12 మంది, ఆసియాలో 8 మందితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 300 మంది ఉద్యోగులు పని చేస్తే చాలు అనేది ట్రంప్ ఆలోచన. ఇక వీరందరిని సెలవులో పంపించనుంది అమెరికా ప్రభుత్వం. పేరుకు సెలవు అని చెబుతున్నా వారి ఉద్యోగాలు ఊడినట్టే అని చెప్పాలి.