- కుంభమేళాకు అఖాడాలకు అవినాభావ సంబంధం
- ప్రతీ కుంభమేళాకు తరలి వచ్చే అఖాడాలు
- అక్కడే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు
- ఘనమైన చరిత్ర అఖాడాల సొంతం
- స్వాతంత్ర ఉద్యమ కాలంనుంచే అఖాడాల ఉనికి
- అన్యమతస్తుల చొరబాట్లను నియంత్రించడానికి
- హిందూ ధర్మ రక్షణకోసం ఉద్యమాలు
- ఆధ్యాత్మిక శక్తి, మానసిక బలమే వారి ఆయుధాలు
- ఆయుధాల వినియోగంలోనూ శిక్షణ
- ఆలయాల పరిరక్షణ లో అందరికన్నా ముందు
అఖాడా అనే పదం అఖండ్ అనే పదం నుంచి పుట్టింది. అంటే పరిపూర్ణత, లేదా సంపూర్ణత అని అర్దం. అఖాడాల వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది.
ఎలా పుట్టిందంటే…
మనదేశంలోకి జైన, బౌద్ధ, ముస్లిం మతాలు ప్రవేశించినప్పుడు హిందూ మతం ఉనికికి ముప్పు వాటిల్లింది. దాంతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయుధాల వినియోగంలో శిక్షణ కూడా అమల్లోకి తెచ్చారు. వాటిని నేర్పి, విదేశీ మతాల చొరబాట్లను నియంత్రించడానికి అఖాడాలను తెరపైకి తెచ్చారు. ఉత్తర భారతం నుంచి గోదావరి నది వరకూ విస్తరించిన హిందూ సంఘాలన్నింటినీ ఏకం చేసి వాటిని 13 సంఘాలుగా విభజించారు. వాటినే 13 అఖాడాలు అంటారు.
అవి ఏమంటే…
జునా, కిన్నర్, మహానిర్వాణి, అటల్, నిరంజనీ, ఆహ్వన్, నిర్మోహి, ఆనంద్, పంచాగ్ని, శ్రీ అఖాడా మహానిర్వాణి, శ్రీ ఆనంద్ అఖాడా, శ్రీ జునా అఖాడా, శ్రీ ఆవాహనా అఖాడాలుగా విభజించారు. వీటిని ప్రధానంగా శైవ, వైష్ణవ, ఉదాసీన వర్గాలుగా విభజించారు. శివుడిని ఆరాధించే వారిని శైవులుగా, విష్ణుమూర్తిని ఆరాధించే వారు వైష్ణవులుగా, ఉదాసీనులను మళ్లీ బడా అఖాడా, ఉదాసీన్ పంచాయత్ న్యాయ అఖాడాగానూ విభజించారు. శైవ అఖాడాను ఆది శంకరాచార్య మళ్లీ పది ఉప అఖాడాలుగా విభజించారు. వీరందరికీ వేర్వేరు ఆరాధ్య దైవాలు, జెండాలు ఉంటాయి. వీరికి మతపరమైన విద్య, ఆధ్యాత్మిక చింతనతో పాటు, ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇస్తారు. అందుకే వీరు క్షేత్ర తేజ్ లుగా వీరత్వం ఉట్టిపడుతూ ఉంటారు.
ఇక వైష్ణవ అఖాడాల విషయానికొస్తే ఇందులో ప్రధానంగా మూడు విభాగాలుంటాయి. వీటికి 18 ఉప అఖాడాలుంటాయి. వైష్ణవ అఖాడాలలో ఉండే వారికి జగద్గురు శ్రీరామానందాచార్య గురువు. ఆయనే ఈ నాలుగు ఉప అఖాడాలను కలిపేసి మూడు బైరాగీ అఖాడాలుగా మిగిల్చారు. వైష్ణవ్ అఖాడాలు కూడా ఆయుధాలను కలిగి ఉంటాయి. వేదాలు కఠోరంగా చదువుతారు. హిందువులను, వారి ఆలయాలను విదేశీ దాడుల నుంచి రక్షించడం వీరి ప్రధమ కర్తవ్యం.
ఇక ఉదాసీన్ అఖాడాలలో రెండు వర్గాలున్నాయి. అవి ఉదాసీన్ పంచాయతీ బడా అఖాడా, ఉదాసీన్ పంచాయతి న్యాయ అఖాడా. వీటికి తోడు సిక్కులకు చెందిన నిర్మల్ అఖాడా కూడా ఉదాసీన్ అఖాడా కిందకే వస్తుంది. ధర్మ గురు గోవింద్ సింగ్ ఈ అఖాడాను ఏర్పాటు చేశారు. సాధారణంగా వీరు పెళ్లికి, వివాహ వ్యవస్థకు సంసార బంధాలకు దూరంగా ఉంటారు. జీవితమంతా ఆధ్యాత్మిక ప్రభోదాలలో, సంబంధిత కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు. మరికొందరు వివాహ వ్యవస్థ నంచి బయటకు వచ్చి నడి వయసులో అఖాడాలలో చేరి శేష జీవితం గడుపుతుంటారు.
ఉత్తర భారతంలోనే ఎందుకు?
అఖాడాలలో ఉన్నవారు ఉత్తర భారత దేశం నుంచే ఎందుకు ఎక్కువమంది ఉంటారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంటుంది. ముస్లిం చక్రవర్తులు, రాజులు భారత్ ను పాలించినప్పుడు ఉత్తర భారతంలోనే హిందూ మతం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. అక్కడ మతపరమైన, సాంస్కృతిక చొరబాట్లు ఎక్కువ. హిందూ మతం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితుల్లో ఏర్పడినవే ఈ అఖాడాలు. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతం వారికి సంప్రదాయాలు, ఆచారాలూ, నమ్మకాలూ ఎక్కువే. అందుకే ఇక్కడ మతధర్మం కట్టు తప్పలేదు. ఎన్ని విదేశీ సంస్కృతులు, మతాలు ప్రవేశించినా ఇక్కడి వారి ఏకాగ్రతను, నమ్మకాన్ని పోగొట్టలేకపోయాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో విద్యావంతులు, వివేచన పరులు ఎక్కువ. అందువల్ల దక్షిణాది వారంతా తెలివి, జ్నాన సంపదపైనే దృష్టి పెడితే ఉత్తరాది భక్తులు ఆధ్యాత్మిక బాట పట్టారు.
హిందూ రాజకీయ శక్తులు బలహీనపడుతున్న తరుణంలో ధర్మ పరిరక్షణ కోసం, ఇస్లామిక్ చొరబాటు దారులు హిందువులపై చేస్తున్న దాడులు, ఆగడాలనుంచి రక్షించడానికి నాగా సాధువులు లేదా దశానమి సాధువులు ఐక్యమయ్యారు. వారంతా త్రిశూలాన్ని వెంట ధరించడం బలానికి చిహ్నంగా భావించారు. కాలక్రమంలో జిమ్నాస్టిక్స్ లాంటి వ్యాయామాలతో అందులో చేరిన యువకులకు దేహ దారుఢ్యాన్ని పెంచి కరవాలం లాంటి ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. అదేసమయంలో వేదాలు కూడా నేర్పించారు. వీరిలో కొందరు ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగించేవారుగానూ, మరికొందరు తమ బోధనలతో ధర్మ పరిరక్షకులుగానూ నిలిచారు.
ఘనమైన చరిత్ర
నాగ సాధువుల చరిత్ర చాలా ఘనమైనది. 1666లో ఔరంగజేబు హరిద్వార్ కుంభమేళాపై సైన్యంతో దండెత్తాడు. అప్పుడు ఈ నాగసాధువులే గట్టి సమాధానం ఇచ్చారు. నాగసాధువుల ప్రేరణతో మొఘల్ సైన్యంలో పనిచేస్తున్న హిందూ సైనికులు కూడా ఔరంగజేబు సైన్యంతో తిరగబడ్డారు. దాంతో ఔరంగజేబు ఓడిపోయి తోక ముడిచి పారిపోయాడు. ఝాన్సీలోని 32 గ్రామాలనుంచి మొఘలుల దాస్య శృంఖలాలను తెంచి వారిని తరిమి కొట్టడంలో నాగసాధువులే కీలకం.1751లో బంగజ్ ఆప్గాన్ అనే ముస్లిం రూలర్ ప్రయాగ పట్టణంపై దాడి చేసి నాలుగు వేల మంది అగ్రవర్ణ మహిళలను ఎత్తుకు పొయాడు. అదే సమయంలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తున్న నాగ సాధువులకు విషయం తెలిసి ఆయుధాలతో దాడి చేసి వారిని చితక్కొట్టి మహిళలను విడిపించారు.
అంతేకాదు స్వాతంత్ర సమరంలోనూ వీరి పాత్ర ఉంది.1855లో హరిద్వార్ కుంభమేళాలో ఆర్యసమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి గురువు ఔమానంద జీ, ఆయన గురువు పూర్ణానంద జీ కలసి బ్రిటీష్ సైన్నాన్ని తరిమి కొట్టడానికి ఒక బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో దేశం నలుమూలలకూ విస్తరించిన నాగసాధువులను పిలిచి వారికి ఈ బ్లూ ప్రింట్ గురించి వివరించారు.1858 ప్రయాగ్ రాజ్ కుంభమేళా సమయంలో నానా సాహెబ్ దండు పంత్, బాలాసాహెబ్ పేష్వా, తాంతియా తోపే, అజ్ముల్లా ఖాన్ లాంటి వారు నాగ సాధువుల గురువు దస్త్ బాబా సమక్షంలో బ్రిటీషర్లను తరిమి కొడతామని ప్రతిన తీసుకున్నారు.ఈ ప్రతినకు వందలమంది నాగ సాధువులు హాజరయ్యారు.
వీళ్లే కాదు బైరాగులు కూడా పోరాటాలలో ముందే ఉంటారు. అన్యమతస్థులు హిందూ మతంపై దాడి చేస్తే వీరు తిప్పి కొడతారు. ధర్మ పరిరక్షణ అంతిమ ధ్యేయంగా వీరు అడుగులేస్తారు. వేద శాస్త్రాలు అభ్యసించిన శైవ, వైష్ణవ అఖాడాలకు చెందిన వారు శాంతికాముకులైన హిందువుల భద్రత పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ అఖాడాల ఏర్పాటు వల్లనే ముస్లిం చొరబాట్లను సింధు సరిహద్దుల్లోనే నిలువరించగలిగారు. సాధారణంగా అన్ని అఖాడాలకు చెందిన వారూ వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.పవిత్ర హిందూ గ్రంథాలు చదవడంతో పాటు ఆయుధాల వాడకంలోనూ నిష్ణాతులై ఉంటారు.
అన్ని అఖాడాలకు చెందిన సన్యాసులు కుంభమేళా సమయంలోనే గుమికూడతారు. వారిలో వారు చర్చలు జరుపుకుని భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకుంటారు. కుంభమేళా జరిగే టైములో అటల్ అఖాడా, నిర్వాణి అఖాడాలు ఒకే చోట ఉంచారు. అలాగే ఆనంద్ అఖాడా, నిరంజనీ అఖాడా కలసి ఉంటారు. కనీసం 12 ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో గడిపిన సాధువుకు ప్రత్యేక ఆధ్యాత్మిక అధికారాలను ఇచ్చివారికి శాఖా పరంగా పదోన్నతులు కూడా కల్పించారు. అఖాడాలలో పదవులు ఇచ్చే వారికి వారిలో ఉన్నఆధ్యాత్మిక పరిణతిని, మానసిక దైర్యాన్ని పరిశీలిస్తారు. ఇందులో కుల, సామాజిక హోదా, ఆర్ధిక సమర్ధతల ప్రశ్నే తలెత్తదు. ఒకసారి అఖాడాలో చేరామంటే అక్కడి క్రమశిక్షణకు లోబడి బతకవలసిందే. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం ప్రవర్తించే వారికి భౌతిక శిక్షలు లేదా జరిమానాలు విధిస్తారు. ప్రతీ అఖాడాలోనూ మహా మండలేశ్వర్, మండలేశ్వర్, మహంత్ అని మూడు కీలక దశలు లేదా పదవులు ఉంటాయి. బ్రహ్మ నిష్టతో కూడిన జీవితం గడుపుతూ, వినయంగా, తెలివిగా ఉండేవారికి పరమహంస కింద పదోన్నతి ఇస్తారు. పరమహంస అయిన వారంతా కాలక్రమంలో వారి సాధనను బట్టి మండలేశ్వర్ నుంచి మహంత్ స్థాయికి ఎదుగుతారు.