ఉద్యోగం కోసం, ఉపాధికోసం, భవిష్యత్తుపై ఆశలతో అమెరికా వెళ్లిన వాళ్లను సరైన పత్రాలు లేవన్న కారణంగా అక్రమ వలసదారులన్న ముద్రవేసి వెనక్కి పంపిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. భారత్ కూడా ఈ నిర్ణయంపై ఏమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పైగా.. అమెరికా నిర్ణయాన్ని సమ్మతించినట్లు అర్థమవుతోంది. మరి.. ఈ సమయంలో భారత్‌లో దశాబ్దాల తరబడి అక్రమంగా చొచ్చుకు వచ్చి.. ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్న, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లను ఎందుకు భారత ప్రభుత్వం వదిలేస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి అనేక మంది అక్రమంగా భారత్‌కు వచ్చి నివసిస్తున్నారు. చాలామంది భారత పౌరులుగా గుర్తింపు పత్రాలు కూడా సంపాదించుకున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ పాతబస్తీ గురించి కూడా ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద చర్య జరిగినా.. దాంతో, హైదరాబాద్‌కు గానీ, హైదరాబాద్ పాతబస్తీకి గానీ లింకు ఉందన్న ఆధారాలు అనేక సార్లు దొరికాయి. ఎంతోమంది విదేశీయులు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు కూడా. ఎన్‌ఐఏ అయితే అనేక సార్లు పాతబస్తీలో నివసిస్తున్న విదేశీయులను అరెస్ట్ చేసింది. ఇలా.. విదేశాల నుంచి వచ్చి తలదాచుకోవడమే కాదు.. దేశంలోని అనేక ప్రాంతాల్లో తిష్టవేసి.. అశాంతి సృష్టిస్తున్న మూకలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయం ఇన్నాళ్లు భారత ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అలాంటి నిర్ణయం తీసుకొని చొరబాట్ల రహిత జనాభా ఉన్న భారతదేశంగా మార్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
ప్రధానంగా భారత్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లోకి విదేశీయుల వలసలు నిత్యకృత్యం అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారతానికి ఇదో రాచపుండులా మారింది. ఈ క్రమంలోనే తాజా పరిణామం గమనిస్తే.. అక్రమంగా తమ రాష్ట్రంలోకి ప్రవేశించిన విదేశీయులను అసోం రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధించింది. అసోం సహా పరిసర రాష్ట్రాల్లోకి విదేశాల నుంచి అనేక మంది వలసలు వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. దీంతో, అసోం సర్కారు అప్రమత్తమయ్యింది. ఈక్రమంలోనే మొత్తం 270 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది. ఆపై వారిని నిర్బంధ కేంద్రాల్లో బంధించింది. గతేడాది డిసెంబర్ 9వ తేదీన ఇందులో అనేక మందిని వారి స్వస్థలాలకు పంపించి వేసింది. కానీ 63 మందిని మాత్రం అలాగే ఉంచింది. ఇప్పటికీ వీరంతా నిర్బంధ కేంద్రాల్లోనే ఉంటున్నారు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా అసోం ప్రభుత్వానికి తగిన సూచనలు చేసింది. వాళ్లను నిర్బంధకేంద్రాల్లో ఉంచకుండా.. వెంటనే వాళ్ల స్వదేశాలకు పంపించివేయాలని ఆదేశించింది.
అక్రమంగా చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు ఓ వైపు అయితే, దేశంలో అనేక ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న రోహింగ్యాల గురించి కూడా చర్చ నడుతస్ంఓది. సొంతదేశం మయన్మార్‌లో అల్లర్లు, కల్లోలం కారణంగా చాలామంది అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి.. అనేక ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటుచ ఏసుకుఉన్నారు. అంతేకాదు.. వీరిలో చాలామంది భారత దేశంలో.. ఇక్కడి పౌరులతో సమానంగా ఆధార్ కార్డులు పొందారు. ఓటరు గుర్తింపు కార్డుల వంటివి కూడా తీసుకున్నారన్న ఆధారాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. అయితే, వీరిని శరణార్థులుగా గుర్తించి.. ఇక్కడ స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తులే కాదు.. డిమాండ్లు కూడా తరచూ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఏకంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం కూడా దాఖలయ్యింది. కానీ, దేశ పౌరులు మాత్రం ఇలాంటి ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం కూడా అక్రమంగా వలసవచ్చిన రోహింగ్యాలకు దేశ పౌరుల హోదా ఇవ్వబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది కేంద్రప్రభుత్వం. చట్టవిరుద్ధంగా ప్రవేశించేవారికి శరణార్థి హోదాను కల్పించే ప్రత్యేక వర్గాన్ని సృష్టించేందుకు శాసనసభ, పార్లమెంటు, కార్యనిర్వాహక విధానాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోజాలదని ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడ్‌విట్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించి పలు సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కేంద్రం ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విదేశీయుడు జీవించే హక్కు, స్వేచ్ఛను మాత్రమే అనుభవిస్తాడని, దేశంలో నివసించే, స్థిరపడే హక్కు లేదని, ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే పరిమితమని పేర్కొంది.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని చేతల్లో కూడా చూపించాలని, అక్రమంగా నివసిస్తున్న విదేశీయులందరి లెక్కలు తేల్చాలని, వాళ్లందరినీ కూడా అమెరికా మాదిరిగానే ఆర్మీ విమానాల్లో వాళ్ల వాళ్ల దేశాలకు తరలించాలన్న డిమాండ్లు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. మరి.. మోదీ ప్రభుత్వం అమెరికా వంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందా? అక్రమంగా చొచ్చుకువచ్చిన విదేశీయుల లెక్కలు తేల్చి వాళ్లను సొంత దేశాలకు పంపిస్తుందా? చూడాలి.