- ఆప్, కాంగ్రెస్ వైఖరితో ముక్కోణపు పోటీ
- భారీగా ఆశలు కల్పించిన ఆప్, బీజేపి
- అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు
- సాయంత్రం 6 గంటలకు ముగియనున్న పోలింగ్
- ఆ తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు
- ఈనెల8న ఎన్నికల ఫలితాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 30వేలమంది పోలీసు యంత్రాంగం, 220 అదనపు పారామిలటరీ దళాల పహారా మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి.70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర రష్ కనపడింది. దాదాపు 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ ఈసారి విడి విడిగా పోటీ చేస్తున్నందున ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. మధ్యాహ్నం ఒంటిగంట దాటేసరికి 33.3 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. పోలీసులు కొన్ని చోట్ల ఓటర్లను తాము చెప్పిన పార్టీకే ఓటు వేయాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టి పారేశారు.పోలింగ్ ఏజెంట్లకు రిలీవర్లను లోపలికి పంపేందుకు పోలీసులు అనుమతించడం లేదని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఆప్,బీజేపి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.. సీలం పూర్ పోలింగ్ బూత్ లో నకిలీ ఓటర్లను ఆప్ ప్రేరేపిస్తోందంటూ బీజేపి ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.కానీ పోలీసులు గుంపులను తరిమి కొట్టి పోలింగ్ కొనసాగిస్తున్నారు.కాగా ఢిల్లీ మురికి వాడల్లో వాల్మీకి కులస్తులను పోలింగ్ కు అనుమతించకుండా బీజేపి నేతలు నిర్బంధంలోకి తీసుకుంటున్నారని ఆప్ ఆరోపించింది.