30.2 C
Hyderabad
Saturday, June 20, 2026

Live Video

spot_img

ఉప ఎన్నికలు వస్తే ఎలా…?

  • పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు
  • న్యాయ సలహా తీసుకొని స్పందిస్తాం అంటున్న ఎమ్మెల్యేలు.
  • ఉప ఎన్నికలు ఖాయం అంటున్న బిఆర్ఎస్
  • నోటీసులు రొటీన్ ప్రాసెస్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి
  • పది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమా..?

తెలంగాణలో ఉప ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో ఉప ఎన్నికల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని బిఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అత్యున్నత న్యాయస్ధానం ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించింది. పది మంది ఫిరాయింపు శాసనసభ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించింది. ఫిరాయింపు శాసనసభ్యులపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వారం రోజులలోగా తెలియచేయాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది.

కోర్టు సీరియస్ గా స్పందించడంతో తొలిసారిగా ఈ కేసు విషయంలో కదలిక వచ్చింది. సోమవారం శాసనసభ కార్యదర్శి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మీద ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పెద్దలతో శాలువాలు కప్పించుకుని పార్టీ ఫిరాయించారు. వీరిలో ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్‌లు బీఆర్‌ఎస్‌ బీఫామ్‌పై గెలిచి అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించారని వీరిపై ఎన్టీ డిఫెక్షన్‌ లా ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ అంశంలో కదలిక రావడం, తెలంగాణ శాసనసభా కార్యదర్శి ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందికి నోటీసులు ఇవ్వడంతో ఇక ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఇదే అంశంపై లాబీల్లో ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.  అయితే ఇప్పట్లో ఎన్నికలు వద్దు అని అభిప్రాయంతో ఈ పదిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోటీస్‌కు కొంత టైం తీసుకుని సమాధానం ఇస్తామని వారు తెలిపారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే దీనిపై స్పందిస్తామని ఫిరాయింపు శాసనసభ్యులు అంటున్నారు.

మొత్తానికి న్యాయ పరంగా ఈ అంశం ఎటువైపు వెళ్లిన ఉప ఎన్నికలు మాత్రం రావడం ఖాయం అనేది బిఆర్ఎస్ నాయకుల వాదన. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇది రొటీన్ ప్రాసెస్ అని సీయం రేవంత్‌రెడ్డి తేల్చిపడేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com