- ఢిల్లీ ఎన్నికల వేళ ఈసీ వర్సెస్ కేజ్రీ ఢీ
- బిధూరీ కోడ్ ఉల్లంఘనలపై చర్యలేవి?
- ఫిర్యాదు చేసిన అతిషి పై ఉల్టా కేసు నమోదు
- ఈసీ రిటైర్ అయ్యాక గవర్నర్ అవుతారా?
- ఈసీ తీరుపై కేజ్రీవాల్ వరుస విమర్శలు
- ఇష్టాను సారం మాట్లాడితే జైలు తధ్యమన్న ఈసీ
ఎన్నికల సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న జిమ్మిక్కులను తాము సహనంతో భరిస్తున్నామని ఈసీ వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఎన్నికలకు ఒకరోజుముందు ఎన్నికల కమిషన్ పై బురద జల్లే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండి పడింది.అయినా తాము దీన్ని సహనంతో ఎదుర్కొంటున్నామంది. ఎన్నికల ముందు పార్టీలు లేవనెత్తిన అనేక అంశాలను 1.5 లక్షల మంది అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారని ఈసీ ప్రకటించింది.
బిధురీ కోడ్ ఉల్లంఘన
బీజేపి ఎంపీ రమేష్ బిధురీ ఎన్నికల కోడ్ ను బాహాటంగానే ఉల్లంఘిస్తున్నా ఈసీ మౌనం దాల్చుతోందంటూ అంతకుముందు ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు.తాను పోటీ చేస్తున్న కాల్కాజీ నియోజక వర్గంలో బీజేపి ఎంపీ రమేష్ బిధురీ తన కుటుంబంతో దర్జాగా బయట తిరుగుతున్నారని, ఇది కోడ్ ఉల్లంఘనేనని అతిషీ ఆరోపించారు.ఇదే విషయాన్ని ఈసీకి కంప్లయింట్ చేస్తే కేసు నమోదు చేయకపోగా, ఉల్టా తనమీదనే కేసు పెట్టారని తన ఎక్స్ ఖాతా లో వాపోయారు.
ఇప్పటికే పోలీసుపై చేయిచేసుకున్న కేసును ఎదుర్కొంటున్న అతిషి 2023లో రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీపై వర్ణవివక్షతో కూడిన విమర్శలు చేశారని, దానిపై చర్యలు లేకపోగా ఇప్పుడు కాల్కాజీలో తన ప్రత్యర్ధిగా బీజేపి నిలబెట్టడం ఆ పార్టీ దురుద్దేశాలకు నిదర్శనం అన్నారు అతిషి.
బిదురీ తక్కువ వాడేం కాదు
రమేష్ బిదూరీకి ఇలాంటి నోటి దురద ఎక్కువే. గతంలో అతిషీ తండ్రిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రియాంక గాంధీనైతే యూపీ రోడ్లను ఆమె బుగ్గల్లా నున్నగా మార్చేస్తానంటూ అసభ్యకరంగా కామెంట్ చేశారు.ఆ కామెంట్లను బీజేపి ఖండించకపోగా అతడినే ఢిల్లీ సీఎం అతిషీకి ప్రత్యర్ధిగా నిలబెట్టింది. మరోవైపు కేజ్రీవాల్ కూడా ఈసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో నెల్లాళ్లలో రిటైర్ అవుతున్న ఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ కు త్వరలోనే గవర్నర్ గిరీ ఇస్తారని అందుకే బీజేపి తొత్తుగా మారారంటూ మండిపడ్డారు.
ఢిల్లీలో కలుషితమవుతున్న యమునా నీటి పైనా కేజ్రీవాల్ ఇలాగే స్పందించారు. యమున నీటిని హర్యానా బీజేపి ప్రభుత్వం విషంగా మారుస్తోందంటూ చేసిన కామెంట్లపై ఆగ్రహించిన ఈసీ ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలంది.రెండు నోటీసులు కూడా ఇచ్చింది. తగిన ఆధారాలు చూపకుంటే జైలు శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఆప్ పార్టీ హాట్రిక్ విజయం కోసం తహతహలాడుతోంది.