– మధ్య తరగతిపై ఉన్నట్టుండి ప్రేమ
– 11 ఏళ్ల తర్వాత ఆదాయపన్నులో వెసులుబాటు
– 2024 ఎన్నికల ఎఫెక్టు కూడా ఒక కారణమేనా?
మధ్యతరగతి ప్రజల కష్టాలు… కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి సీతారామన్ కి 11 ఏళ్ల తర్వాత గుర్తొచ్చాయా? అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇప్పటికి మూడో టెర్మ్ అధికారంలోకి వచ్చిన బీజేపీ కూటమి 11వ ఏట అడుగుపెట్టింది. మరిన్నేళ్లు ముక్కుపిండి వసూలు చేసిన పన్నులపై ఇప్పుడే ఎందుకు కరుణ చూపారనే అంశంపై రకరకాలు వాదోపవాదాలు నెట్టింట జరుగుతున్నాయి.
అందులో ప్రధానంగా చెబుతున్నది ఏమిటంటే, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీకి కావల్సినన్ని సీట్లు రాలేదు. ఏపీలో తెలుగుదేశం, బీహార్ లో నితీశ్ కుమార్ దయతలచడం వల్ల అధికార పీఠమెక్కారనేది జగమెరిగిన సత్యం.
అయితే తమకు సీట్లు రాకపోవడానికి, ఓటు బ్యాంకు తగ్గిపోవడానికి గల కారణాలను తీవ్రంగా అన్వేషించిన పార్టీకి కొన్ని లోపాలు తెలిశాయి. అయోధ్య రామాలయం కట్టినా ఉత్తరప్రదేశ్ లో అనుకున్న సీట్లు రాలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చాలాచోట్ల పోటీ మానుకుని మిత్రపక్షాలకు జీవదానం చేయడం వల్ల సీట్లు పోయాయి.
పదేళ్లు అధికారంలో ఉండటం వల్ల సహజంగా ఏర్పడే అనాసక్తి, ఇండియా కూటమి కారణంగా 5వేల ఓట్ల తేడాతో దేశం మొత్తమ్మీద బోర్డర్ లో పోయిన 23 ఎంపీ సీట్లు… ఇలా ఎన్నోకారణాలు వారికి కనిపించాయి. రాజకీయల పరంగా వాటిని మార్చే శక్తి బీజేపీకి లేదు. దీంతో మరో మార్గం ఎంచుకున్నారు. అదేమిటంటే మధ్యతరగతిని టార్గెట్ చేయడం…బడ్జెట్ లో ప్రధానంశంగా కనిపిస్తోంది.
మధ్యతరగతి జీవులు కట్టే ఆదాయపన్నులో చాలా అసంత్రప్తులు కారణంగా కనిపిస్తున్నాయి. చిన్న, సన్నకారు వ్యాపార, ఉద్యోగ వర్గాల ఆదాయం తక్కువ, కట్టేదెక్కువనే భావనలో ఉన్నారు. అది కూడా ఓటింగుపై ప్రభావం పడిందని అంటున్నారు. అందువల్లనే 2027లో జరగనున్న జమిలీ ఎన్నికలకు ముందు నుంచి బడ్జెట్ లో ఆదాయం తగ్గిస్తే, ఇండియా కూటమి కారణంగా ఏర్పడిన లోటును సరిచేసుకోవచ్చునని అనుకుంటున్నారని సమాచారం.
అసలు మధ్య తరగతిని టార్గెట్ చేస్తే ఓట్లు పడతాయా? అనే అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే… భారతదేశానికి మరో పేరేమిటంటే మధ్యతరగతి భారత దేశం…దీనిని మూడు తరగతులుగా విడదీశారు. ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి…ఇప్పుడీ విభాగాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారంటే… ఎగువ మధ్య తరగతిలో 16 కోట్ల మంది ఉంటే, మధ్య తరగతిలో 43.20 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దిగువ మధ్య తరగతిలో 14 కోట్ల మంది ఉన్నారు.
అంటే మొత్తం కలిపితే 74 కోట్ల మంది భారతీయులు మధ్య తరగతి విభాగంలో అటూఇటూ ఉన్నారు. అంటే 140 కోట్ల భారతదేశ జనాభాలో వీరే సగానికి సగం ఉన్నారు. అంతేకాదు వీరే ఎక్కువగా టాక్స్ పేయర్స్ గా ఉన్నారు..
అప్పర్ క్లాస్ లో కోటీశ్వరులు, అపర కోటీశ్వరులు, కుబేరులు అంతా కలిసి కేవలం 2 కోట్ల మంది వరకే ఉన్నారు. ఇందులో మళ్లీ రిచ్ అంటే హైక్లాస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్లు ఖరీదైన బంగ్లాలు, కార్లు, లగ్జరీ జీవితాలు అనుభవించేవాళ్లున్నారు. వీరు సుమారు 11 కోట్ల మంది వరకు ఉన్నారు. ఇలా బాగా డబ్బులున్నవాళ్లంతా కలిసి 13 నుంచి 15 కోట్ల వరకు ఉంటారని అంచనా.
140 కోట్లలో ఎగువ, మధ్య తరగతి కలిపి 90 -100 కోట్ల వరకు తీసేస్తే, మిగిలిన 40 కోట్ల మంది ప్రజలు దిగువ తరగతిలో ఉన్నారు. వీరిలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు సుమారు 10 కోట్ల మంది వరకు ఉన్నారని అంచనా.
ఇప్పుడీ లెక్కలను బట్టి చెప్పేదేమిటంటే, దేశానికి ఆదాయపు పన్ను ద్వారా ఎక్కువ కట్టేది మధ్యతరగతి ప్రజలే అన్నది అర్థమవుతోంది. అంతేకాదు వీరి ఓటింగు శాతం కూడా ఎక్కువే కాబట్టి, అదే తమకి దెబ్బ కొట్టిందని భావించి, ఆ వర్గాన్ని దగ్గరకు తీసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఆదాయపు పన్ను భారీగా తగ్గించడమని అంటున్నారు. ఇంత ప్రేమ ఒలకబోయడానికి అదే కారణంగా కనిపిస్తోందని పలువురు వ్యాక్యానాలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి.