28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

నిధుల్లో వివక్ష, ప్రాజెక్టులపై నిర్లక్ష్యం -కేంద్రంపై డిప్యూటీ సీఎం భట్టి ధ్వజం

– తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కేంద్రం
– రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టిన మోదీ సర్కార్‌
– నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం
– రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో కేంద్రం స్పందించాలి
– కేంద్ర బడ్జెట్‌ స్వరూపంపై భట్టి విక్రమార్క

కేంద్ర బడ్జెట్ 2025-26లో మళ్లీ తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క. ఈ బడ్జెట్ రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలను విస్మరించి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పలు అంశాలపై భట్టి విక్రమార్క కేంద్రం తెలంగాణకు చేసిన అన్యాయంపై వివరణాత్మక విమర్శలు చేశారు.

(1) సెస్ పెంపు – రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు :

కేంద్ర బడ్జెట్ 2025-26లో కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్‌లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించింది. ఈ విధానం కేంద్రం-రాష్ట్రాల ఆర్థిక సంబంధాల్లో రాష్ట్రాల న్యాయమైన వాటాను దెబ్బతీసేలా ఉంది.

(2) ఆర్థిక సమాఖ్య ప్రాతిపదికను క్షీణింపజేసే చర్యలు :

కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర సహాయ పథకాలకు (CSS) కేటాయింపు గతేడాది రూ. 4,15,356 కోట్ల నుంచి రూ. 5,41,850 కోట్లకు (30.5% వృద్ధి) పెంచారు. రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను పెంచాలనే రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణించకుండా, CSS పై ఆధారపడే విధానాన్ని మరింత పెంచడం ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.

(3) వివక్షపూరితంగా నిధుల కేటాయింపు :

ఈసారి కేంద్ర బడ్జెట్‌లో బిహార్ రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా అధిక నిధులు కేటాయించబడినప్పటికీ, గతంలో ఆ రాష్ట్రం ఆదాయంలో ప్రాశస్త్యాన్ని చూపింది. ఆర్థిక లోటు అనుమతించిన పరిమితికి తక్కువగా ఉంది. అయితే, సమర్థవంతమైన వనరుల వినియోగ సామర్థ్యం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం కేవలం తెలంగాణకే కాకుండా, దేశ అభివృద్ధికి కూడా నష్టం కలిగించే అంశం.

(4) తెలంగాణ సాగు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం :

తెలంగాణ రాష్ట్రం సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతగా భావిస్తూ నిరంతరం పనిచేస్తోంది. కానీ, ఈ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర సాగు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించలేదు. రైతులను అర్థికంగా బలోపేతం చేయడంలో ఈ బడ్జెట్ వైఫల్యం చెందింది. కేంద్రం వ్యవసాయ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతున్నా, తెలంగాణలోని సాగు ప్రాజెక్టులను పక్కనపెట్టడం దారుణం.

(5) వరంగల్ విమానాశ్రయం విస్మరణ :

కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. అయితే, తెలంగాణలోని వరంగల్ విమానాశ్రయ అభివృద్ధిపై ఎలాంటి ప్రస్తావన లేదు. హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక ప్రధాన విమానాశ్రయంపై మోదీ సర్కారు ఆధారపడటం వల్ల రాష్ట్రీయ వృద్ధికి ఆటంకం కలుగుతోంది. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి ద్వారా ప్రాంతీయ సంయోగాన్ని మెరుగుపరచి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఏర్పడేది.

(6) తెలంగాణలో ఏఐపై కేంద్రం నిర్లక్ష్యం :

దేశంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ – AI) రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. NVIDIA, Intel, Adobe వంటి గ్లోబల్ సంస్థల భాగస్వామ్యంతో “తెలంగాణ AI మిషన్” (T-AIM) విజయవంతంగా అమలవుతోంది. అయితే, గతంలో కేంద్రం ప్రకటించిన మూడు AI కేంద్రాల స్థాపనలో తెలంగాణను పూర్తిగా విస్మరించడం దారుణం. తాజా బడ్జెట్‌లో ప్రకటించిన AI కేంద్రాల ఎంపిక ప్రక్రియలో ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి.

(7) ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం :

ఈ బడ్జెట్ ప్రసంగంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రస్తావన లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 86,000 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఖర్చుచేసిన రూ. 89,263 కోట్ల కంటే తక్కువ. ఇది గ్రామీణ ఉపాధి కల్పనను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది.

(8) మాటల్లో అందలం.. కార్యాచరణ శూన్యం :

ఈ బడ్జెట్ ‘గరీబ్, యువ, అన్నదాత, నారీ’ (పేదలు, యువత, రైతులు, మహిళలు) సంక్షేమాన్ని ముందుగానే హైలైట్ చేసినప్పటికీ, వారిని ప్రోత్సహించే ఎటువంటి స్పష్టమైన కార్యక్రమాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కార్యాచరణ పథకం లేకుండా ఇచ్చిన హామీలు ప్రజలకు ఒరిగేలా ఉండవు.

(9) కేంద్రం సముచితంగా స్పందించాలి :

కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి రాష్ట్రాల హక్కులను విస్మరించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం సముచితంగా స్పందించాలి

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com