పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే తమ లక్ష్యమన్నారు. దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించామని చెప్పారు. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చెసినట్లు చెప్పారు.మహాకుంభ్‌లో ఉత్సవం జరుగుతోందని, మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదంపై సంతాపం తెలియజేశారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పిస్తున్నట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు. భారతదేశంలో నిర్మించిన గగన్‌యాన్‌లో భారతీయ పౌరుడు అంతరిక్షంలోకి వెళ్ళే రోజు ఎంతో దూరంలో లేదని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం స్పేస్ డాకింగ్‌లో విజయం సాధించడం వల్ల భారతదేశం తన స్వంత స్పేస్ స్టేషన్‌ను కలిగి ఉండటానికి మార్గం మరింత సులభతరం చేసిందన్నారు.దేశంలో మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. విద్యకు ఎవ్వరు కూడా దూరంగా ఉండకూదనే ఉద్దేశంతో మాతృభాషలో విద్యకు అవకాశాలు అందిస్తున్నామన్నారు. 13 భారతీయ భాషల్లో వివిధ రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహించడం ద్వారా భాష సంబంధిత అడ్డంకులు తొలగుతాయని భావించామని, అందుకే భాషా పరంగా ప్రాముఖ్యత ఇచ్చామన్నారు రాష్ట్రపతి ముర్ము. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.యువత విద్య, వారికి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోందన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. దేశం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, మోదీ మూడో టర్మ్‌లో దేశంలో 3 రెట్లు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని ప్రధానాంశాలు :
– మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మూడు రెట్లు వేగంగా పనిచేస్తోంది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలో అవతరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
పేదరిక నిర్మూలన, సంక్షేమం :
పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకువచ్చాం. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్నాం.
సొంతింటి కల సాకారం :
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు మూడు కోట్ల కుటుంబాలకు అదనంగా ఇళ్లు నిర్మించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పొడిగించాం.
ఆరోగ్య సంరక్షణ :
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం.
రైలు మార్గాల్లో విప్లవాత్మక మార్పులు :
అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టుతూ దేశ రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం.
విద్యా రంగంలో ప్రగతి :
విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తున్నాం. నూతన విద్యా విధానం ద్వారా ఆధునిక విద్యా వ్యవస్థను నిర్మిస్తున్నాం.
సంస్కరణలు, కొత్త నిర్ణయాలు :
సంస్కరణలను వేగవంతం చేస్తూ, ఒకే దేశం – ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు వంటి సాహసోపేత నిర్ణయాలను అమలు దిశగా తీసుకెళ్తున్నాం.
మహిళల సాధికారత :
దేశంలోని కార్పొరేట్ సంస్థల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం గొప్ప ముందడుగు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలను సాధికారత కల్పిస్తున్నాం. 3 కోట్ల మంది మహిళలను లక్పతీ దీదీగా మార్చడమే లక్ష్యం.
నూతన ఆవిష్కరణలు, పరిశోధన :
భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చే లక్ష్యంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ప్రారంభించాం.
టెక్నాలజీ రంగంలో పురోగతి :
కృత్రిమ మేధ (AI) రంగంలో భారత ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. మన గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం త్వరలోనే అంగారక యాత్రకు ముందడుగుగా నిలవనుంది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ప్రయోగం చేసి ఇస్రో మరో విజయం సాధించాం.
వ్యాపార, ఎగుమతుల ప్రోత్సాహం :
ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాలు, ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు లాంటి చర్యలతో అన్ని రంగాల్లో వ్యాపారాలను అభివృద్ధి పరుస్తున్నాం.
సైబర్ భద్రతపై దృష్టి :
సైబర్ సెక్యూరిటీలో సమర్థత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్‌ఫేక్‌లు వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాం.
భారత డిజిటల్ విజయాలు :
భారత్ డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ లావాదేవీలు అభివృద్ధి చెందిన దేశాల ప్రశంసలు అందుకున్నాయి.