26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

విద్య, ఆరోగ్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

– మహిళల అభివృద్దే కేంద్రంగా నిధులు కేటాయింపు
– బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవం
– ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క మల్లు

ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్య పై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయన్నారు. ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణ కు దక్కుతుందని ఆయన అన్నారు. విద్యా రంగ అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో పాఠశాలను 200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని ఇప్పటికే 60 స్కూళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు.

మహిళలకు విద్యను అందిస్తే ఆ ఫలితం కేవలం ఆమెకే కాకుండా కుటుంబానికి.. సమాజానికి మేలు జరుగుతుందని భట్టి విక్రమార్క వివరించారు. కుటుంబ వ్యవస్థ దేశానికి బలం.. ఆ కుటుంబ వ్యవస్థను నడిపించే శక్తి అమ్మ, భార్య, సోదరి రూపంలో ఉన్న మహిళ అని అభివర్ణించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మహిళల అభివృద్ధికి అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని వివరించారు, వారికి చదువు, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని.. విద్యార్థినీలు కళాశాలలకు వెళ్లేందుకు, మహిళలు ఉచితంగా పని ప్రదేశాలకు వెళ్లేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని.. వీటితో రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోదని తెలిపారు.

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. సహజంగా వీటిని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తారు అందుకు భిన్నంగా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇందిరమ్మ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తుందని తెలిపారు. సోలార్ విద్యుత్ లో పెట్టుబడుల కోసం బ్యాంక్ లింకేజీ ఇప్పించడం, మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేయడం మహిళలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పథకం దేశంలోనే గొప్ప పథకంగా అభివర్ణించారు.

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్ద బోతున్నామని వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, వారి తరఫున వడ్డీని ఆర్థిక శాఖ చెల్లిస్తుందని వివరించారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిరాగాంధీ మహిళలు ఏ పనినైనా చేయగలరని నిరూపించారని తెలిపారు. 1959లో 15 మంది విద్యార్థినీలతో ప్రారంభమైన సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల ప్రస్తుతం 3000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమని, ఈ కళాశాలలో చదివిన విద్యార్థినిలు గొప్ప ప్రతిభను కనబరుస్తున్నారని అభినందించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com