- ఫిబ్రవరి 14,15 తేదీల్లో అప్పగింత
- సంచలనం కలిగించిన జయలలిత కేసు
- భూములు,ఇళ్లు, ఎస్టేట్లు, గార్డెన్లు,
- బంగారమంటే పిచ్చి.. ఏడువారాల నగలతోపాటు ఖరీదైన నగలు
- చీరలు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులంటే క్రేజ్
- చెన్నై నడిబొడ్డున సొంతిల్లు వేదనిలయం
- దాదాపు రూ.4వేల కోట్ల విలువైన ఆస్తులు
దివంగత మాజీముఖ్యమంత్రి జయలలిత ఆస్తులన్నీ మరి కొద్దిరోజుల్లోనే తమిళనాడు ప్రభుత్వ పరం కాబోతున్నాయి. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో కర్ణాటక హైకోర్టు వాటిని తమిళనాడు ప్రభుత్వానికి అందించనుంది. దాదాపు దశాబ్ద కాలం పాటు నడిచిన ఈ కేసు చివరకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె వారసులమంటు రక్తసంబంధీకులు మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, ఆమెకు సేవ చేసిన నెచ్చెలినంటూ శశికళ కోర్టులకెక్కారు. అయితే వారందరి కేసులను కర్ణాటక హై కోర్టు కొట్టి పారేసింది. జయలలిత ఆస్తులకు తామే వారసులమని, వాటిని తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ట్రయల్ కోర్టులో దాఖలైన బంధువుల పిటిషన్లు అన్నింటినీ హై కోర్టు కొట్టి పారేసింది. వాస్తవానికి రెండేళ్ల నుంచి ఈ ఆస్తుల అప్పగింత కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు 4వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వ పరమవబోతున్నాయి.
తమిళనాడు సీఎంగా జయలలిత రాజకీయ ప్రయాణమే పెద్ద సంచలనం. పురచ్చితలైవిగా పేరుపడిన జయలలిత తమిళనాడు ప్రజల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై రాజకీయ రంగంలో కాలుపెట్టి ప్రత్యర్ధులను తన కాలికిందకు తెచ్చుకున్నారు. జయలలితలో కొంత పట్టుదల, పగ పాళ్లు కూడా ఎక్కువ. తనను డీఎంకే ప్రభుత్వం జైలు పాల్జేసినప్పుడు, రకరకా వేధింపులకు గురిచేసినప్పుడు తాను అధికారంలోకి వచ్చాక కరుణానిధికి అంతకంతా బదులిచ్చేశారు.
ఉచితాలకు బీజం వేశారు…
ఒక విధంగా చెప్పాలంటే సంక్షేమ పథకాల పేరిట ఉచితాల పంపిణీకి ఆమె ఆద్యురాలు. తమిళనాడు ఎన్నికల తీరు చిత్రవిచిత్రంగా ఉంటుంది. ప్రజలు ప్రతీ ఐదేళ్లకోసారి మార్పు కోరుకుంటారు. ఒకసారి ఒక పార్టీకి, మరోసారి మరో పార్టీకి అధికారమిస్తుంటారు. జయలలిత ప్రస్థానం తమిళ రాజకీయాలలో ప్రత్యేకమైనది. తొలిసారి సీఎం అయ్యాక ఆమె ప్రజలకు చేసిన సేవలు ఆమె రాజకీయ భవితవ్యానికి బాటలు పరిచాయి. అయితే ప్రతీసారి ఎన్నికల్లో గెలుపుకోసం ఆమె ఉచితాల పంపిణీని అలవాటు చేశారు. ఆ తర్వాతే అది ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకోడానికి కారణమైంది.
జయలలిత ఆస్తులెన్ని?
రాజకీయంగా ఎదురు లేని సమయంలో ఆమె సంపాదించిన ఆస్తులన్నీ ఆ తర్వాత ఆమె మెడకు చుట్టుకున్నాయి. బహుశా పదవిలో ఉంటూ జైలుకు వెళ్లిన తొలి సీఎం కూడా ఆమెనే. భూములు, ఎస్టేట్లు, పొలాలు, ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, వేదనిలయం ఇల్లుతో పాటు తెలంగాణలో పేట్ బషీరాబాద్ లోనూ ఆమెకు 12 ఎకరాల ద్రాక్ష తోటతో సహా ఎన్నో ఆస్తులున్నాయి.
ఒక్క పొయెస్ గార్డెన్ లోని వేద నిలయం ఇల్లే కొన్ని కోట్లు ఖరీదుంటుంది. తన తల్లి సంధ్య కొన్న ఆ ఇంటిని ఆమె ఆ తర్వాత మూడంతస్తుల భవనంగా మార్చారు. స్థిరాస్థుల్లో కొన్ని ఆమె పేరు మీద ఉండగా, మిగతావన్నీ బినామీల పేరు మీదే ఉన్నాయి.ఇవికాక ఇంకా డిపాజిట్లు, ఇన్వెస్ట్ మెంట్లు, రకరకాల కార్లు అయితే చెప్పనే అక్కరలేదు.
ఆస్తుల విలువ రూ. 4వేల కోట్ల పైమాటే..
1996లో తొలిసారిగా ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది.అప్పటినుంచి విచారణ జరుగుతూ వస్తున్న కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. పదేళ్ల క్రితం తమిళనాడు ప్రభుత్వం అక్రమాస్తుల కేసులో జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు వాటి విలువ రూ.913 కోట్లు. అయితే నేడు ఆ ఆస్తుల విలువ రూ.4 వేల కోట్ల పైమాటే. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ జయలలితకు భూములున్నాయి. ఊటీ, కొడైకెనాల్, కొడనాడు లాంటి ప్రాంతాల్లో ఎస్టేట్లు, టీ గార్డెన్లతో సహా ఆమెకున్న ఆస్తుల విలువ వేల కోట్లే. మొత్తం 1562 ఎకరాల ఈ భూముల హక్కు స్వాధీన పత్రాలన్నీ తమిళనాడు సర్కార్ కి అందుతాయి.అలాగే జయలలితకు బంగారమంటే పిచ్చి. దాదాపు 27 కిలోల బంగారం, వేల కోట్లు ఖరీదు చేసే వజ్రాల హారాలు, వడ్డాణాలు, అర వంకీలు ఆమె దగ్గరున్నాయి. వీటిని ధరించి అప్పుడప్పుడు ఆమె శశికళతో దిగిన ఫోటోలే అందుకు సాక్ష్యం. ఏడు వారాల నగలతో పాటు, మరిన్ని అత్యాధునిక డిజైన్లలో బంగారు ఆభరణాలు ఆమె పేరున ఉన్నాయి. అంతే కాదు జయలలితకు చీరలు, చెప్పులు, గడియారాలు, హ్యాండ్ బాగులంటే యమాక్రేజ్. విదేశాలకు వెళ్లినప్పుడు ఎంత ఖర్చయినా వాటిని కొనుక్కునేవారు. కొన్ని గిప్టుగా వచ్చినవి. దాదాపు 750 చెప్పుల జతలు ఆమెకు ఉన్నాయంటే ఆమెకు సంపద, నగలు, అలంకరణ వస్తువులపై ఉన్న వ్యామోహం అర్ధమవుతుంది. జయలలిత ఇంట కేవలం చెప్పులకే ఓ రూమ్, చీరలకు ఓరూమ్, హ్యాండ్ బాగులకు ఓ రూమ్ ప్రత్యేకంగా ఉండేవట. ఆమె ఏ రంగు చీర ధరిస్తే అందుకు తగిన కలర్ రిస్ట్ వ్యాచ్, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు బయలుదేరేవారు. ఇవన్నీ ఒక ఎత్తయితే 1996లో తన దత్తపుత్రుని వివాహాన్ని ఆమె నభూతో నభవిష్యత్ అన్న తీరులో నిర్వహించారు. అంగరంగవైభవంగా సాగిన ఆ వేడుకలో డబ్బు ఏరులై పారింది. ఇదే ఆమె అక్రమాస్తుల సంపాదనకు ఒక తార్కాణంగా నిలిచింది.
దేశచరిత్రలోనే జయలలిత ఒక సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 19 ఏళ్ల పాటూ విచారణల పేరుతో సాగిన కేసు ఇదొక్కటే కామోసు. రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ వారసులు లేకపోవడంతో ఆమె మరణానంతరం బంధువులే కోర్టులకెక్కి ఆస్తులను క్లెయిమ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చివరకు అవి ప్రభుత్వ పరమే అయ్యాయి. ఫిబ్రవరి 14న ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తే సుదీర్ఘమైన ఈ వివాదానికి శాశ్వతంగా తెరపడుతుంది.