కొద్దిరోజులుగా మౌనంగా ఉన్న హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర జేసింది. దీంతో ఉదయాన్నే మళ్లీ హైడ్రా కలకలం చెలరేగింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వాళ్ల గుండెల్లో గుబులు మొదలయ్యింది. సంగారెడ్డి జిల్లాలో మరోసారి హైడ్రా కొరడా ఝుళిపించింది. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముత్తంగి గ్రామంలోని 296 సర్వే నెంబర్‌లో గాయత్రీ వెంచర్ పేరుతో కాలనీ నిర్మించారు. అయితే, ఆ కాలనీకి సంబంధించిన పార్కు స్థలం కబ్జాచేసిన కొందరు అక్రమార్కులు షెడ్లు నిర్మించారు. దీనిపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కబ్జాదారులకు చుక్కలు చూపించారు. అధికారులు జేసీబీని తీసుకొచ్చి అక్రమంగా నిర్మించిన షెడ్డును తొలగించారు. కబ్జాలను అడ్డుకోవడంలో హైడ్రా అధికారుల పనితీరుపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.