ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి సర్కారు బలపరిచని అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ అన్నారు. డీఎస్సీ మీద మొదటి సంతకం చేశారు గానీ, ఇప్పటివరకూ నోటిఫికేషన్‌కే దిక్కులేదన్నారు. జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నారాలోకేష్ ప్రకటించినా జాడలేదన్నారు. అలాగే, నిరుద్యోగ భృతి ఏమైందో ప్రజలకు చెప్పలేని పరిస్థితుల్లో కూటమి నేతలు, వాళ్ల అభ్యర్థి ఉన్నారని జీవీ సుందర్ విమర్శించారు. అందుకే ప్రజల్లోకి వస్తే తరిమికొడతారన్న భయంతో వాళ్లు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగడం లేదన్నారు. ప్రజా గొంతుకనై ప్రజా సమస్యలపై తాను పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అనపర్తిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు వేయాలని అభ్యర్థించేందుకు తాను నిత్యం ఓటర్లను కలుస్తుంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాత్రం కనిపించడం లేదంటూ పట్టభద్రుల ఓటర్లు తనను అడుగుతున్నారన్నారు. తన మేనిఫెస్టో చూసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎవరి దగ్గరికి వెళ్లినా.. మీరొక్కరేనా అభ్యర్థి అని అడుగుతున్నారన్నారు.
- Advertisement with us -