వైద్యవిద్య కోర్సులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన కీలక తీర్పుపై కలకలం చెలరేగుతోంది. ఆ తీర్పు మెడిసిన్ చదువుతోన్న, చదవాలనుకుంటున్న అభ్యర్థులకు శరాఘాతంగా పరిణమించిందన్న చర్చ సాగుతోంది. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్లకు సంబంధించి ఇప్పటిదాకా అమలవుతోన్న లోకల్ కోటాను సుప్రీంకోర్టు రద్దు చేసింది. స్థానిక నివాసం ఆధారంగా అమలు చేస్తున్నరిజర్వేషన్ల కోటా అవసరం లేదని తేల్చి చెప్పింది. అసలు, ఇలాంటి రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ తరహా రిజర్వేషన్ సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఉందని అభిప్రాయపడింది.
మెడికల్ పీజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి లోకల్ కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ.. ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ కోర్సుల్లో తప్పనిసరిగా మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు.. మనమంతా భారత భూభాగంలో స్థిర నివాసులమేనని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇందులో ప్రాంతీయ, రాష్ట్ర నివాసం.. అనేవి లేవని, దేశంలో ఎక్కడైనా నివాసాన్ని ఎంచుకునే, వ్యాపారం లేదా వృత్తిని కొనసాగించే హక్కును అందరం కలిగివున్నామని, భారతదేశమంతటా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ తీర్పు ఇప్పటికే అమలవుతోన్న రిజర్వేషన్లను ప్రభావితం చేయదని సర్వోన్నత న్యాయస్థానం పే ర్కొంది.
సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించిన తీర్పు ప్రధానంగా తెలంగాణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఈ పరిణామంతో రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో ఇప్పటివరకు 50శాతం లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అయితే, ఇకపై ఆ రిజర్వేషన్ వర్తించదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు కూడా తీవ్ర నష్టం కలిగించేలా ఉందంటున్నారు. మెడికల్ కాలేజీలు భారీగా ఉన్న తెలంగాణలో, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్థానిక విద్యార్థులు వైద్యవిద్య చదివే అవకాశం కోల్పోయే ప్రమాదం పొం్చి ఉందంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 34 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో అందుబాటులోకి వచ్చిన సీట్లను పరిశీలిస్తే.. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ కాలేజీలతో పోలిస్తే.. తెలంగాణలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే, పీజీ మెడికల్ సీట్లలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు తెలంగాణలోని పీజీ మెడికల్ కాలేజీల్లో 2,924 సీట్లు ఉన్నాయి. వాటిలో 50శాతం లోకల్ కోటా రిజర్వేషన్‌లు ఉంటే.. 1,462 పీజీ సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుతెలంగాణ విద్యార్థులకు శరాఘాతంగా పరిణమించిందంటున్నారు. ఈ తీర్పు ప్రకారం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే రావాల్సిన 1,462 సీట్లు కూడా ఆలిండియా కోటాలోకి చేరతాయి. అంటే.. మొత్తం వందశాతం సీట్లు జాతీయస్థాయి కోటాలోకే వెళ్లనున్నాయి. తెలంగాణ మాత్రమే కాకుండా.. దక్షిణ భారతదేశంలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులకు కూడా ఈ పరిణామం నష్టదాయకమంటున్నారు విద్యావేత్తలు. దక్షిణాది రాష్ట్రాల్లో వైద్య విద్యార్థుల సేవలు పరిశీలిస్తే.. తెలంగాణలో ఒక పీజీ స్టుడెంట్ 12,799 మందికి వైద్య సేవలందిస్తుంటే, కర్ణాటకలో ఒక పీజీ మెడికల్ విద్యార్థి 10,573 మందికి, ఏపీలో ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ 15,079 మందికి, తమిళనాడులో ఒక పీజీ మెడికల్ విద్యార్థి 15,123 మందికి, కేరళలో ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ 18,662 మందికి సేవలు అందిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో దేశ సగటు 20,460గా ఉంది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బ తినే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పీజీలో ఇన్ సర్వీస్ కోటా కూడా ఈ నిర్ణయంతో ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు విఘాతం కలిగే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తాయి. పీజీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్ రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయి. లోకల్ రిజర్వేషన్ లేకుంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులకు, వైద్య విద్యార్థుల సేవలు ఆయా రాష్ట్రాల్లో వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సుప్రీంకోర్టు కానిస్టిట్యూషన్ బెంచ్‌కు వెళ్లాలని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్‌ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉంటుందన్న సలహాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. మరోవైపు.. కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.