35 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

ఏపీలో సరికొత్త ‘వాట్సప్ పరిపాలన’కు శ్రీకారం

– వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
– తొలిదశలో ప్రజలకు అందుబాటులోకి 161 సేవలు
– వాట్సప్ గవర్నెన్స్ సేవల కోసం మెటాతో ఒప్పందం
– దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సప్ గవర్నెన్స్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో వినూత్న పరిపాలనా పద్ధతికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రప్రభుత్వ సేవలను వాట్సప్‌లో ప్రారంభించింది. దీంతో, ఏపీ వ్యాప్తంగా వాట్సప్‌ గవర్నెన్స్‌ ప్రారంభమయ్యింది. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ ఈ సేవలను ప్రారంభించారు. ఈ సేవలకోసం ప్రత్యేకంగా అధికారిక వాట్సప్‌ నంబర్‌ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ ఉంది. పౌరసేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

వాట్సప్‌ గవర్నెన్స్‌లో భాగంగా ఏపీలో తొలి దశలో 161 రకాల పౌర సేవలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండో విడతలో వాట్సాప్‍లో 360 సేవలను అందుబాటులో ఉంచనున్నారు. అప్పటికి వాట్సప్ గవర్నెన్స్‌కు ఏఐను కూడా జోడించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

తొలివిడతలో అందించే సేవలు :

తొలి విడత వాట్సప్‌ గవర్నెన్స్‌లో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖలకు సంబంధించిన సేవలు అమలులోకి వచ్చాయి. వాట్సప్‌ సేవలతో సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇకపై ఫుల్‌స్టాప్‌ పడనుంది. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నా కూడా ఈ వాట్సప్‌ అకౌంట్‌ ద్వారానే మెస్సేజ్‌లు పంపించనుంది. ఒక్క క్లిక్‌తో ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరేలా సాంకేతికతను జోడించారు. వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి వాట్సప్‌ మెస్సేజ్‌ల ద్వారా అందించనున్నారు.

విజ్ఞప్తులు, ఫిర్యాదులకూ వేదిక :

ప్రభుత్వం సమాచారం పంపించడమే కాదు.. ప్రజలు కూడా తమ విజ్ఞప్తులు సమర్పించాలన్నా.. ఫిర్యాదులు చేయాలనుకున్నా.. ఈ వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేయవచ్చు. ప్రజలు మెస్సేజ్‌ చేయగానే ఒక లింక్‌ వస్తుంది. ఆ లింక్‌ ఓపెన్‌ చేసి.. తమ పేరు, ఫోన్‌ నంబర్, అడ్రస్‌ తదితర వివరాలు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఎంటర్‌ చేసిన తర్వాత.. తాము ఏ అంశంపై విజ్ఞప్తి చేయాలో, ఏ అంశంపై ఫిర్యాదు చేయాలో వివరంగా మెస్సేజ్‌ బాక్స్‌లో టైప్‌ చేయాలి. వివరాలన్నీ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేసిన తర్వాత రిప్లై వస్తుంది. తమ విజ్ఞప్తి, ఫిర్యాదుకు సంబంధించిన ఒక రెఫరెన్స్‌ నంబర్‌ వస్తుంది. ఆ నెంబర్‌ ఆధారంగా తమ వినతిగానీ, తమ ఫిర్యాదు గానీ, పరిష్కారం ఎంత వరకు వచ్చిందనే వివరాలు, ఆ మెస్సేజ్ ఏ అధికారి దగ్గర ఉందనే వివరాలు కూడా ప్రజలు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, వాటిని పొందేందుకు అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు వంటి పూర్తి వివరాల గురించి ఈ వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌ చేసి, తెలుసుకోవచ్చు కూడా. అంతేకాదు.. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని కూడా ఈ వాట్సప్‌ సర్వీస్‌ ద్వారా పొందవచ్చు. తమకు కావాల్సిన పర్యాటక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని.. అక్కడికి వెళ్లేందుకు అవసరమైన టికెట్లు, ఆ ప్రాంతంలోని వసతి సదుపాయాలు వంటివి బుక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

తప్పనున్న వ్యయ ప్రయాసలు :

ఏపీలో అమలులోకి వచ్చిన వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా సర్టిఫికెట్లకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ప్రయాస ఇకపై తప్పనుంది. వీటిద్వారా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్‌ వంటి వివిధ శాఖలకు సంబంధించిన చాలా సర్టిఫికెట్లు వాట్సప్‌ సర్వీస్‌ ద్వారానే పొందవచ్చు. సీఎంఆర్‌ఎఫ్‌కి ఎవరైనా దరఖాస్తు చేసి ఉంటే.. ఆ దరఖాస్తుల స్టేటస్‌ కూడా తెలుసుకోవచ్చు. విద్యుత్‌ బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి కూడా ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్‌ లైసెన్స్‌లు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్‌ రికార్డులు, ఇతర రెవెన్యూ సర్టిఫికెట్లు కూడా ఈ వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పొందవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్‌ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్‌ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్‌బ్యాక్‌ తదితర సేవలు కూడా ఈ సర్వీసు ద్వారా పొందవచ్చు.

సెకన్లలోనే సర్కారు సేవలు :

వాట్సప్‌ గవర్నెన్స్‌ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ… వాట్సప్‌ గవర్నెన్స్‌.. చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైలురాయి అని అభివర్ణించారు. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండబోదన్నారు. ఇప్పటివరకూ ఎవరూ ప్లాన్‌ చేయని విధంగా సరికొత్త పాలనా విధానానికి శ్రీకారం చుట్టామన్నారు నారా లోకేష్‌. ఈ సర్వీస్‌ ద్వారా దాదాపు 80 శాతం సేవలను సెకన్ల వ్యవధిలోనే అందిస్తామన్నారు. రెండో విడతలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సరికొత్త వాట్సప్‌ పాలనా విధానాన్ని తాము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నామన్నారు. ప్రభుత్వమే అవసరార్థులైన ప్రజలకు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించే విధానం అమలులోకి తీసుకొస్తున్నామన్నారు.

పాలనలో సాంకేతికత :

ఏపీలో, చంద్రబాబు 2.O పాలనలో వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు మంత్రి లోకేష్‌. భవిష్యత్తులో మన మిత్ర కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. రాబోయే ఆరు నెలల్లో గణనీయ మార్పులను అందరూ ఊడబోతున్నారని చెప్పారు. ప్రజలే తమ అవసరం కోసం బటన్‌ నొక్కే విధానాన్ని మన మిత్ర వాట్సప్‌ సేవల ద్వారా తీసుకొస్తున్నామన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తరహాలో ప్రజలకు అవసరమైన సేవలు కూడా ఇకపై అత్యంత వేగంగా అందిస్తామన్నారు. భవిష్యత్తులో 520కి పైగా పౌర సేవలను వాట్సప్‌ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితమని లోకేష్‌ చెప్పారు. అయితే, ఏదైనా సర్వీసుకోసం బుక్‌ చేసుకున్నప్పుడే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, రియల్‌టైమ్‌లోనే అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షల హాల్‌ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సప్‌ ద్వారా పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటినుంచి జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్‌ కోడ్‌ ఇస్తామని, సర్టిఫికెట్‌లో తప్పులు ఉన్నా.. తేలిగ్గా పరిష్కరించుకోవచ్చన్నారు.

వాట్సప్‌ గవర్నెన్స్‌కు ఒకే నెంబర్‌ :

వాట్సప్‌ గవర్నెన్స్‌లో భాగంగా 95523 00009 నంబర్‌ ద్వారానే అధికారికంగా ప్రభుత్వం నుంచి సేవలు అందుతాయన్నారు నారాలోకేష్‌. ఎవరైనా వేరే నెంబర్ల ద్వారా వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు అందిస్తామని చెబితే నమ్మొద్దన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు తొలిదశలో అమలులోకి తెచ్చిన సేవలకు తోడు.. రెండోదశలో అందుబాటులోకి తేనున్న సేవల కోసం చట్టసవరణలు కూడా చేయబోతున్నామన్నారు. ఈ సర్వీసుకు సంబంధించి ఒప్పందం చేసుకున్న మూడు నెలల్లోనే తొలిదశ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో సేవలు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని భాషల్లోనూ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ తరహా సేవలు ప్రపంచంలోనే తొలిసారి అని చెప్పారు. అయితే, ఎక్కువ మంది ఒకేసారి ఈ సర్వీసులను వాడటం వల్ల సర్వర్‌ సమస్యలు కూడా తలెత్తే ఆస్కారం ఉందన్నారు. యూజర్ల లోడ్‌కి తగినట్లుగా సర్వర్ల పెంపు వంటి అంశాలను మరో రెండు రోజుల్లోనే పరిష్కరించనున్నామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com