- ఫిబ్రవరి 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ
- పట్టభద్రుల బరిలో మళ్లీ జీవన్ రెడ్డిని నిలిపే అవకాశం
- రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై త్వరలో నిర్ణయం
- ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
- ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన బిఆర్ఎస్
- ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ దూరం
- పట్టబద్రుల నియోజకవర్గాలపై అధికార టీడీపీ కన్ను
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఒక పట్టుభద్రుల స్థానానికి.. అదేవిధంగా రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూలు విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. మిగతా పార్టీలకు ఎలా ఉన్నా అధికార పార్టీకి మాత్రం ఇవి ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైన ఎన్నికలు గాని భావించాల్సి ఉంటుంది. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనప్పటికీ పార్టీ బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక ఖాళీ అవుతున్న స్థానాల విషయాలకొస్తే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నాలుగు జిల్లాలకు కలిపి ఒక ఎమ్మెల్సీ ఉంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక టీచర్ల నియోజకవర్గానికి వస్తే మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్సీ గా ప్రస్తుతం రఘోత్తమ్‌రెడ్డి ఉన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురి పదవీ కాలం ముగియడంతో మూడు స్థానాలకు వచ్చే నెల 27న పోలింగ్ జరుగనుంది. మార్చి మూడున ఓట్లను లెక్కిస్తారు.
ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే పట్టభద్రుల స్థానం నుంచి మళ్లీ టి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్ధానాలకు సంబంధించి చాలా మంది ఇప్పటికే పీసీసీ అధ్యక్షునికి దరఖాస్తు చేసుకున్నారు. వారం రోజుల్లోగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో పోటీ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యే ఉండనుంది.
ఏపీలో కూడా మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో రెండు పట్టభద్రుల స్ధానాలు కాగా మరొకటి టీచర్స్ నియోజకవర్గం. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ బహిష్కరించినట్లు గతంలోనే ప్రకటించింది. ఇక అధికార టీడీపీ విషయానికి వస్తే గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూడా మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పేరు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గతంలోనే ప్రకటించంది.