- బారికేడ్లు దాటుకుని రావడం వల్లనే తొక్కిసలాట
- అఖాడా ఘాట్ లో హృదయ విదారక దృశ్యాలు
- చెల్లాచెదురుగా పడిపోయిన భక్తుల సామాన్లు
- దుప్పట్లు, దుస్తులు,చెప్పులు, బ్యాగుల కుప్పలు
మహాకుంభమేళాకు వచ్చే భక్తులు త్రివేణి సంగమం దగ్గరే స్నానాల కోసం పట్టుబట్ట వద్దని, గంగానదికి చెందిన దగ్గరి ఘాట్ లలో స్నానాదులు ఆచరించమని యూపీ సీఎం యోగీ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపి నడ్డా ఉదయాన్నే ఫోన్లు చేసి పరిస్థితిపై ఆరా తీశారన్నారు.
అఖాఢా మార్గ్ లో కొందరు భక్తులు బారికేడ్ల పైకెక్కి దాటి పరుగులు తీయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మౌనీ అమావాస్య సందర్భంగా అఖాడాలలోని నాగసాధువుల పవిత్ర స్నానాల కోసం ఏర్పాట్లు చేసిన ప్రదేశంలో అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ఒక్కసారిగా భక్తులు బారికేడ్లు తోసుకు రావడం, వాటి పైకెక్కి దాటి పరుగులు తీయడం చేశారని ఫలితంగా ఏర్పడిన తొక్కిసలాటలో అనేక మంది గాయపడ్డారని యోగీ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా ఉద్రిక్తంగానే ఉందన్నారు.
హృదయవిదారక దృశ్యాలు…
తొక్కిసలాట జరిగిన అఖాడా మార్గ్ లో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. దుస్తులు, చెప్పులు, బ్యాగుల కుప్పలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దుప్పట్ల దొంతరలు, గుట్టలు గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా కనిపిస్తున్నాయి. ఆ తొక్కిసలాట నుంచి తప్పించుకోడానికి చాలా మంది ఆ కుప్పల మీద నుంచే పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగిన వెంటనే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్న ఆరాటంతో భక్తులు బారికేడ్లను విరిచేశారు. ఎటుపడితే అటు ప్రాణ భయంతో పరుగులు తీశారు.