వచ్చే నెలలో రధసప్తమి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చెయ్యడానికి టీటీడీ సిద్దమవుతోంది. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లపై చర్చించడానికి ఈనెల 31వ తేదీన తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డ్ సమావేశం కానున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 4వ తేదీన రధసప్తమి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార సర్వదర్శనం టోకెన్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలకమండలి భావిస్తోంది. గతానుభావాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చెయ్యడంలో నిమగ్నమయ్యారు. రధసప్తమి సందర్శంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ మూడు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ పాలకమండలి ప్రకటించింది. అలాగే ఫిబ్రవరి 4వ తేదీ రధసప్తమి నాడు అర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు, అన్నిరకాల ప్రివిలైజ్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. రధసప్తమి పర్వదినం రోజు వీలైనంత మంది ఎక్కువగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి భావిస్తోంది.
- Advertisement with us -