తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తవుతున్న సందర్భంగా మరో కీలక హామీని నెరవేర్చేదిశగా ఆలోచనలు చేస్తోంది. తమ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ఆరు గ్యారెంటీల అమలులో ఇప్పటికే పలు హామీలను నెరవేర్చింది. మరికొన్ని హామీల అమలుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ఆసరా పెన్షన్‌ల మొత్తాన్ని నాలుగువేల రూపాయలు చేసే హామీపై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే పెన్షనర్లు ఎందరు? వాళ్లకు ఇప్పుడు చెల్లిస్తున్న పెన్షన్ల మొత్తం ఎంత? పెన్షన్ మొత్తాన్ని పెంచితే ఖజానాపై ఇంకెంత మొత్తంలో భారం పడుతుంది? అన్న అంశాలపై ఓ క్లారిటీకి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో, త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలు చేస్తున్నారు. రైతు రుణమాఫీ దాదాపుగా పూర్తి చేసారు. ఇంకా రుణమాఫీ చేయాల్సిన వారికి త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో పెన్షన్ రూ 4వేలకు పెంచి అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని అంటుననారు. ఈప్రకటన తర్వాత పంచాయితీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భం కూడా వస్తున్నందున దీనిని పంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకోవచ్చన్న వ్యూహంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సమగ్ర కుటుంబసర్వే జరుగుతోంది. పలు ప్రాంతాల్లో జనం.. కాంగ్రెస్‌పార్టీ హామీలు, రైతు భరోసా డబ్బుల కోసం, పెన్షన్‌ల పెంపు కోసం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. విపక్షాలకు ఇవి ఆయుధాలుగా మారాయి. దీంతో, ఇదే పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు వెళ్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. ఆసరా పెన్షన్ల పెంపును ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉందంటున్నారు.
ప్రస్తుతం ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ప్రతినెలా రూ.2వేలు చెల్లిస్తున్నారు. వాటిని రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే, దివ్యాంగులకు ప్రస్తుతం రూ.4వేలు పెన్షన్ వాళ్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ.6వేలుగా చేయనున్నారు. ఆర్థికశాఖ ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.