-
బీఆర్ఎస్ బహిరంగ సభపై సోషల్ మీడియాలో డిబేట్
-
డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ ట్రోల్స్
భారత రాష్ట్రసమితి రజతోత్సవ బహిరంగ సభ ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నారు. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో గత ఉత్సాహం నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో లేక పోవడంతో ఈ సభ కేసీఆర్‌కు కీలకంగా మారింది. అయితే సభకు సమయం దగ్గరపడుతున్నా, పార్టీ కార్యకర్తల్లో ఆసక్తి తక్కువగానే కనిపిస్తోంది. ప్రతి రోజు ఒకటీ, రెండు జిల్లలా నాయకులతో ఫామ్‌హౌస్‌లో సమావేశమవుతున్న కేసీఆర్, సభను విజయవంతం చేయాలంటూ పలు సూచనలు చేస్తున్నారు. కానీ, కేసీఆర్ సమావేశంలో నాయకులు.. సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. బహిరంగ సభ, సభా ఏర్పాట్లపై మాత్రం పెదవి విరుస్తున్నారని అంటున్నారు.
ఇక, అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్.. ప్రభుత్వ ఖజానా నుంచే నిధులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేశారని, సీఎం హోదాలో పార్టీ బస్సు యాత్రలకు కూడా ప్రభుత్వం నుంచే ఖర్చు చేశారని విమర్శలు వస్తున్నాయి. ఇక, ఇప్పుడు పరా్టీ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున మూడు వేల బస్సులు కావాలంటూ టీఎస్‌ఆర్టీసీకి రూ.8 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపైనా కాంగ్రెస్ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. ఇది కూడా అధికారంలో ఉండగా దోచుకున్న సొమ్మేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు.. ఈ సభకోసం బీఆర్ఎస్ ప్రజలను ఆకర్షించేందుకు విభిన్న రీతిలో ప్రచారం కూడా మొదలుపెట్టింది. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు గోడలపై పెయింటింగ్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గోడలపై స్వయంగా రాసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దళిత నాయకుడినని చెప్పుకునే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దొరల దగ్గర తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయితే, ఇలాంటి సభలు గ్రాండ్‌గా జరిగేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తిరస్కరించిన ప్రజలు.. లోక్‌సభ ఎన్నికల నాటికి అసలు ఆ పార్టీ అడ్రస్ లేకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో, ప్రజల్లో ఆ పార్టీకి విశ్వాసం ఏ స్థాయిలో తగ్గిందో తేటతెల్లమవుతోందన్న వాదనల నేపథ్యంలో జరుగుతున్న ఈ బహిరంగసభతో అయినా ప్రజల్లో తిరిగి సానుకూలత సంపాదించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అది అంత సులువు కాదన్న చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు.. ఇప్పుడు రజతోత్సవ సభ వేదికపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? గతంలో చేసిన పొరపాట్లను అంగీకరిస్తారా? ప్రజల్లో సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తారా? లేక మళ్లీ అదే ఒరవడిని కొనసాగిస్తారా? అనేది ఆసక్తి కరంగా మారింది.