అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల విషయంలో అసలేమాత్రం తగ్గేదేలే అంటోంది చైనా. ట్రంప్ విధించిన 34 శాతం టారిఫ్‌లకు కౌంటర్‌గా చైనా కూడా 34 శాతం టారిఫ్‌లు విధించింది. అయితే ఈ టారిఫ్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 8లోపు చైనా టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఏప్రిల్ 9 నుంచి 50 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ పీక్స్‌కు చేరినట్టు తేలిపోయింది. అయితే ట్రంప్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది చైనా. అమెరికా తన బ్లాక్‌మెయిలింగ్ పద్ధతులను మానుకోవడం లేదని.. చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో అస్సలు వెనకడుగు వేయదని తేల్చి చెప్పింది. నిజంగానే 50 శాతం టారిఫ్‌లు విధిస్తే.. దానికి కౌంటర్‌గా ఏం చేయాలన్నదానిపై ఇప్పటికే దృష్టి పెట్టామని తెలిపింది. ట్రంప్ ఇప్పటికే అనేక తప్పులు చేశారని.. అందులో అతి పెద్ద తప్పు ఇదేనని తేలిపింది.
చైనా 34 శాతం టారిఫ్‌లు విధించినప్పటి నుంచే ట్రంప్ ఫైర్ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే తమ దేశాన్ని దోచుకున్నారు.. మళ్లీ టారిఫ్‌లు ఎలా విధిస్తారంటూ రివర్స్‌లో కౌంటర్ వేస్తున్నారు. అంతేకాదు చైనా భయపడిందని.. తప్పుడు నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే యూఎస్, చైనా మధ్య పీక్స్‌కు చేరిన ట్రేడ్ వార్‌లో ఇప్పుడు మరింత ఆజ్యం పోశారు ట్రంప్. ఒక్క చైనానే కాదు.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశం ప్రయత్నించినా మరిన్ని టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు ట్రంప్.
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని తెగేసి చెబుతోంది చైనా. అందుకే ఎంత టారిఫ్‌లు విధిస్తే దానికి తగ్గట్టుగా తాము కూడా టారిఫ్‌లు విధిస్తామని చెబుతోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన 16 కంపెనీలకు ఎగుమతులను నిషేధించింది. అంతేకాదు రక్షణ, చిప్స్ తయారీలో ఉపయోగించే కొన్ని అరుదైన ఖనిజాలను కూడా అమెరికాకు ఎగుమతి చేయడం నిలిపివేసింది.