37.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

కుంభమేళాలో 100 అడుగుల అనకొండ కనిపించిందా? – భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ

ప్రయాగ్‌ రాజ్‌లోని త్రివేణి సంగమంలో 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళా కన్నుల పండువగా జరుగుతోంది. ఇసకేస్తే రాలనంతగా జనం మహా కుంభమేళాకు తరలి వస్తున్నారు. మన దేశం నుంచే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ మహా కుంభమేళాకు భక్తులు, మునులు, సాధువులు తరలి వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

అయితే, కుంభమేళా ప్రత్యేకత, కుంభమేళాకు ఉన్న డిమాండ్‌, కుంభమేళాకు ఉన్న ట్రెండ్‌ కారణంగా సోషల్ మీడియాలో ఫేక్‌న్యూస్‌ కూడా ఇదే స్థాయిలో పోస్ట్‌ అవుతున్నాయి. కొందరు తెలిసి మరీ.. తప్పుడు పోస్టులు షేర్‌ చేస్తుంటే.. మరికొందరేమో తెలియకుండా.. నిజమేమో అని భ్రమించి వాటిని ఫార్వార్డ్‌ చేస్తున్నారు.

జరుగుతున్న ప్రచారం :

ఆ క్రమంలోనే ఇప్పుడో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ భారీ అనకొండ త్రివేణీ సంగమంలో భక్తుల మధ్యకు వచ్చిందని, నదిలో తచ్చాడుతోందనేది ఆ వీడియో సారాంశం. దాదాపు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో విస్తృతంగా షేర్‌ అవుతోంది. ఆ వీడియోలను లక్షల మంది వీక్షిస్తున్నారు కూడా.

2025 ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో 100 అడుగుల కంటే ఎక్కువ పొడవున్న ఒక పెద్ద పాము కనిపించిందని, దాని బరువు వెయ్యి కిలోల దాకా ఉంటుందంటూ కొందరు తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై షేర్‌ చేస్తున్నారు.

shreymusafir అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఇదే అర్థం వచ్చే రైటప్‌ ఇస్తూ.. ఈ వీడియోను తన ప్లాట్‌ఫామ్‌పై షేర్‌ చేశాడు. “మహాకుంభంలో 100 అడుగుల పొడవు మరియు 1000 కిలోల పాము కనిపించింది – భక్తులలో భయాందోళనలు!” అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ పోస్ట్‌ చేశాడు. ఆ లింక్‌ కింద చూడొచ్చు.

https://www.instagram.com/reel/DFFNV1BTr27/?utm_source=ig_embed&ig_rid=5c25e097-be6c-415f-a2e0-85341bb9b300

Shalu Sharma అనే యూట్యూబ్ అకౌంట్‌లో కూడా ఇదే వీడియోను పోస్ట్‌ చేశారు. ‘మహా కుంభమేళాలో వాసుకి దర్శనం’ పేరుతో ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. దానికి సంబంధించిన లింక్‌ కింద చూడొచ్చు.

భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ :

ఈ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయి. అంత భారీ పాము నీళ్లల్లో తిరుగుతున్నా.. అక్కడే నదీ స్నానాలు ఆచరిస్తున్న వాళ్లలో ఏమాత్రం భయం కనిపించడం లేదు. ఏ మాత్రం జడుసుకోకుండా అంత పెద్ద పామును అలాగే చూస్తున్నారు. ఈ పాము తిరుగుతున్న దృశ్యం నిజమే అయితే, అక్కడున్న వాళ్లలో కనీసం ఒకరిద్దరైనా భయంతో జడుసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే.. ఈ వీడియో నిజం కాదన్న సందేహం.. పరిశీలనలోనే అర్థమవుతోంది. అయితే, సాంకేతిక ఆధారాలతో ఈ వీడియో వాస్తవమా? కాదా? అని నిరూపించాల్సి ఉన్నందున ఈ వీడియోలోంచి కొన్ని కీ ఫ్రేమ్స్‌ సేకరించడం జరిగింది. వాటి ద్వారా రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో పరిశీలిస్తే.. కుంభమేళాలో ఈ భారీ పాము తిరుగుతున్నట్లు రైటప్‌ ఇచ్చిన వీడియోలే ఎక్కువగా కనిపించాయి. పైగా ఆ వీడియోలన్నీ లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి.

అయితే, ఇదే క్రమంలో అధికార వర్గాల ప్రకటనలు, అక్కడి విశేషాలకు సంబంధించిన రిపోర్టుల కోసం అన్వేషించడం జరిగింది. మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వెతికాము. కానీ, ఎక్కడా ఇంత పెద్ద పాము మహా కుంభమేళాలో కనిపించిందన్న అధికారుల ప్రకటనలు గానీ, మీడియా ఛానెళ్లలో గానీ, పత్రికల్లో గానీ ఇలాంటి వార్త వచ్చినట్లు గానీ ఎక్కడా కనిపించలేదు. నిజంగానే మహా కుంభమేళాలో ఇలాంటి పరిణామం జరిగి ఉంటే.. అధికారులు కచ్చితంగా ప్రకటన జారీ చేసేవారు. అలాగే, మీడియాలో జాతీయ స్థాయిలోనే ప్రధాన వార్త అయ్యుండేది. కానీ, అలాంటి ఆనవాళ్లేమీ దొరకలేదు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో ఇలాంటి కల్పిత వీడియోలను క్రియేట్‌ చేయడం చాలా సులువుగా మారిన పరిస్థితుల్లో కచ్చితంగా ఈ వీడియోలన్నీ ఏఐ ఆధారంగా రూపొందించినవే అయ్యుంటాయన్న క్లారిటీ వచ్చింది. అయితే, ఆధారాల కోసం ఏఐ చెకింగ్‌ టూల్స్‌ను కూడా వినియోగించడం జరిగింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి.. వాటిలోంచి కీ ఫ్రేమ్స్‌ తీసుకొని wasitai, hive, sightengineAI వంటి డిటెక్షన్‌ టూల్స్‌లో కూడా ఈ వీడియోను పరిశీలిస్తే.. ఈ వీడియో కంప్యూటర్‌లో కృత్రిమంగా తయారు చేయబడిన వీడియో అని స్పష్టత ఇచ్చాయి.

అయితే, ఇవి మొదటగా ఎవరు రూపొందించారు. ఏవైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వాస్తవ రైటప్‌తో పోస్ట్‌ చేశారా? అని మరింత శోధించడం జరిగింది. దీంతో, Linda`s AI Live అనే యూట్యూబ్‌ ఛానెల్‌ లింక్‌ దొరికింది. ఆ ఛానెల్‌లో అన్నీ ఏఐతో తయారు చేసిన వీడియోలు మాత్రమే ఉన్నాయి. ఆ ఛానెల్‌కు సంబంధించిన లింక్‌ కింద చూడొచ్చు.

https://www.youtube.com/shorts/vzqhP5pS3Wc

ఇప్పుడు కుంభమేళాలో కనిపించాయని చెబుతున్న భారీ సర్పాల వీడియోలన్నీ ఈ ఛానెల్‌లో ఉన్నాయి. అయితే, ఇదో కంప్యూటర్‌లో రూపొందించిన వీడియోలు పోస్ట్‌ చేసే యూట్యూబ్‌ ఛానెల్‌. ఇందులో అన్నీ VFX క్రియేషన్‌లో తయారు చేసిన వీడియోలే ఉన్నాయి. అంతేకాదు.. ఛానెల్‌ డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా రాశారు. ‘ఈ ఛానెల్‌లో పోస్ట్‌ చేస్తున్న మొత్తం కంటెంట్ పూర్తిగా కంప్యూటర్ ద్వారా రూపొందించబడిన కృత్రిమ ఫుటేజీ. ఇది కేవలం వినోద ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడింది. దయచేసి దీన్ని ఎవరూ తీవ్రంగా పరిగణించవద్దు. మీకు నచ్చితే, సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ధన్యవాదాలు’ అని ఛానెల్‌ డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. అంటే.. ఓ యూట్యూబర్‌.. ఎంటరటైన్‌మెంట్‌ కోసం కంప్యూటర్‌లో రూపొందించిన వీడియోలను తీసుకొని కొందరు ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో ఈ సర్పం కనిపించిందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. వీటిని చూసిన వాళ్లందరూ షేర్‌ చేసుకుంటున్నారు.

============================================================

వైరల్‌ అవుతున్నదేంటి ?

ప్రయాగ్‌ రాజ్‌ మహా కుంభమేళాలో భారీ అనకొండ కనిపించింది. అది 100 అడుగుల పొడవు, 1000 కిలోలకు పైగా బరువున్న భారీ సర్పం.

వాస్తవం ఏంటి ?

ఈ వీడియోలన్నీ కంప్యూటర్‌లో రూపొందించినవి. వాస్తవంగా రికార్డ్‌ చేసినవి కాదు. ఈ వీడియోలు పోస్ట్‌ చేసిన యూట్యూబరే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ :

సోషల్‌ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం. భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్‌ పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడయ్యింది.

============================================================

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com