28.1 C
Hyderabad
Monday, October 26, 2026

Live Video

spot_img

స్థానిక ప్రజాప్రతినిధులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన డిప్యూటీ సీఎం

– ప్రజా ప్రతినిధుల పెండింగ్ బిల్లులు త్వరలో విడుదల చేస్తాం
– బిల్లుల పెండింగ్‌కు బీఆర్‌ఎస్‌ నేతలే కారణం
– ఈ అంశంలో బీఆర్‌ఎస్‌ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
– ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్థానిక సంస్థల్లో మొన్నటిదాకా ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ముఖ్యంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తాము ప్రజా ప్రతినిధులుగా ఉన్న సమయంలో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో తమ సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశారు. వాళ్లంతా పలు దఫాలుగా ప్రభుత్వ ప్రతినిధులను కలిసి బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. వాళ్లందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటన ఊరటనిచ్చింది.

ప్రధానంగా రూ.10 లక్షల లోపు పెండింగ్‌లో ఉన్న ప్రజా ప్రతినిధుల బిల్లుల విడుదలకు ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వంటి ప్రజా ప్రతినిధులు గడిచిన యేడాది డిసెంబర్‌ 7వ తేదీ నాటికి చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.1,300 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయని తెలిపారు. ఇందులో రూ.10 లక్షల లోపు బకాయిల విలువ సుమారు రూ.400 కోట్ల దాకా ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తాను గమనించి రూ.10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలో విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

గత ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, వారిని వీధులపాలు చేశారని తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం రోడ్లపైకి వస్తాం, ధర్నాలు చేస్తామని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల పెండింగ్ బిల్లుల గురించి బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com