ఇటీవల ముగిసిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. శనివారం ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌లో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరుగగా, 65.02 శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ మహాయుతి కూటమి, కాంగ్రెస్-శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(ఎస్‌పీ) మహా వికాస్ అఘాడి మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు నెలకొంది. కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో జరిగింది. తొలివిడతలో 66.65 శాతం, రెండో విడతలో 68.45 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడ జార్ఖండ్ ముక్తిమోర్చా-కాంగ్రెస్ కూటమి, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మధ్య నువ్వా నేనా? అన్నట్లు పరిస్థితి నెలకొంది.