తెలంగాణ తల్లి విగ్రహంపై గత కొంత కాలంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 9వ తేదీన సెక్రెటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. గతంలో ఉన్న విగ్రహంలో మార్పులు చేస్తామని, తెలంగాణ ప్రజల మనసుల్లో ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూపం బయటకు వచ్చింది. అయితే, కొత్త విగ్రహానికి, పాత విగ్రహానికి పూర్తిస్థాయిలో తేడా ఉంది. రెండు విగ్రహాల మధ్య ఏమాత్రం పోలిక లేకపోవడం గమనార్హం.
ఈనెల 9వ తేదీన సెక్రెటేరియట్ ఆవరణలో ప్రతిష్టించనున్న తెలంగాణ తల్లి విగ్రహం నమూనా రూపం బయటకు వచ్చింది. ప్రస్తుతం రూపొందించిన కొత్త విగ్రహం.. ఓ సాధారణ మహిళను తలపించేలా ఉంది. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీరను ధరించి ఉండగా.. కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి తెలంగాణ తల్లి దర్శనమిస్తోంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండేవి. కొత్త విగ్రహంలో ఆ కిరీటం, చేతిలో బతుకమ్మ కూడా లేదు. పాత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించిన తెలంగాణ తల్లి విగ్రహం సాక్షాత్కరిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో రూపొందించిన పాత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా.. కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు కిరీటం ఉన్నాయి. కొత్త విగ్రహం మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా.. కొత్త విగ్రహం కుడి చేతితో అభయ హస్తంతో దర్శనమిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్తవిగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.