తెలంగాణ రాష్ట్రం మనుగడలో ఉన్నంతకాలం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మాన సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. మన్మోహన్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి మరీ.. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారని, అది చారిత్రాత్మకమని స్పష్టం చేశారు.
ఎందరో పుడతారో మాయం అవుతారన్న భట్టి విక్రమార్క.. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారని.. ఆ కోవలోకే దివంగత నేత మన్మోహన్ సింగ్ వస్తారన్నారు. దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్‌సింగ్ అని, ఇప్పుడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ సింగే అని కొనియాడారు. హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నానన్నారు. మన్మోహన్ సింగ్ తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారన్నారు. ప్రతి బాధ్యతలోనూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులే కాదు.. సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కే దక్కుతుందన్నారు. సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది మన్మోహన్‌సింగ్ హయాంలోనే అన్నారు. దేశగతినే మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయన తీసుకువచ్చారని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఏర్పడిన సమయంలో ఉపాధిహామీ చట్టం ద్వారా దేశ ప్రజలు ఆర్థిక మాధ్యం బారిన పడకుండా కాపాడగలిగారని ప్రశంసలతో ముంచెత్తారు. ఆత్మగౌరవం లేకుండా అడవుల్లో జీవించే వారి కోసం అటవీ హక్కు చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. అలాగే, భూ సేకరణ చట్టం తీసుకువచ్చి దేశంలో ప్రగతిశీల వాదుల మన్ననలు పొందారని మన్మోహన్‌సింగ్‌ను కొనియాడారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.