పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 24న కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈరోజు (మంగళవారం) ప్రకటించారు. పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఈ నెల 26న ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులు సమావేశం కానున్నారు. నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి నవంబర్ 26ను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది.
మరోవైపు ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. గురుగావ్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు-2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విపక్షాలు, అధికార ఎన్డీయే కూటమి సభ్యుల మధ్య పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ సాగే అవకాశం ఉంది.