గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జారీచేసిన జీవో నెంబర్ 16ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో 16 తీసుకువచ్చింది. ఈ జీవో ద్వారా దాదాపు 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అయితే, ఈ జీవో నిరుద్యోగులకు శాపంగా మారిందని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన హైకోర్టు జీవో 16 రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలతో ఆ జీవో ద్వారా రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. క్రమబద్ధీకరణ అయి ఆనందంగా ఉన్న తమ నియామకాలు చెల్లవని హైకోర్టు చెప్పడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.