రాజస్థాన్‌లోని జై సల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. పలు అంశాలపై కేశవ్ ఇచ్చిన కీనోట్ ప్రసంగానికి ఇతర రాష్ట్రాల ఆర్థిక శాఖామంత్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఏపీకి చెందిన పలు అంశాలపై జీఎస్టీ కౌన్సిల్లో పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. వీటితో పాటు జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే అంశాలను కూడా ఎత్తిచూపుతూ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు చేశారు. పయ్యావుల కేశవ్ చేసిన పలు ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యింది.
కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల పలు కీలక సూచనలు చేశారు. అలాగే, కీలకాంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చొరవను కూడా జీఎస్టీ కౌన్సిల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి ఏం కావాలో ప్రజెంట్ చేస్తూనే.. వివిధ రంగాల్లో జీఎస్టీ కౌన్సిల్ అనుసరించాల్సిన విధానాలను చక్కగా చెప్పారని ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కొనియాడారు. పయ్యావుల కేశవ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అప్పటికప్పుడు మంత్రి వర్గ ఉపసంఘం వేసింది. తాను చేసిన సూచనలపై వెంటనే మంత్రి వర్గ ఉప సంఘం వేసినందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కృతజ్ఞతలు తెలిపారు. పయ్యావుల కేశవ్ వెంట జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు కూడా వెళ్లారు.
కౌన్సిల్లో పయ్యావుల తన సందేశం ఇస్తూ.. 5 శాతానికి మించి జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై రాష్ట్రంలో జరిగే రవాణపై ఒక్క శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించాలని ప్రతిపాదించారు. దీనివల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఈ సెస్ ద్వారా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ, పునరావాస చర్యలు చేపడతామని ప్రతిపాదన తెచ్చారు. 2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించారని గుర్తు చేశారు. ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా కోరారు. పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని, ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలని పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చిన్న వ్యాపారస్తులు.. కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అలాగే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని, అలాగే బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని పయ్యావుల కేశవ్ కోరారు.