జనవరి రెండోవారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. 8వ తేదీన ఉత్తరాంధ్రకు మోదీ వస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారైనట్లు పీఎంవో వర్గాలు ధృవీకరించాయి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టిపిసి, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి నవంబరులోనే నరేంద్రమోదీ వీటికి శంకుస్థాపన చేస్తారని అందరూ భావించారు. నవంబర్‌లో ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఇంతలో తుఫాన్ రావడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నవంబర్ 29వ తేదీన ప్రధాని మోదీ పర్యటనను అప్పుడు ఫిక్స్ చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేశారు. కానీ తుఫాన్ హెచ్చరికల కారణంగా ఆ కార్యక్రమాలన్నీ వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా జనవరి 8వ తేదీన ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా మోదీ పర్యటన ఇదే మొదటిసారి. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరయ్యారు. అయితే, ఇప్పుడు తొలిసారిగా అధికారికంగా ఏపీలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన విధంగా భారీగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి లోకేష్‌తో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 85 వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నం ప్రతిష్ట కూడా మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖను గ్రోత్ హబ్ గా ప్రకటించిన కేంద్రం.. దానికి సంబంధించి కార్యాచరణ చేపట్టింది. మరోవైపు ఏపీ ప్రజలకు పదేళ్లుగా ఊరిస్తూ వస్తున్న రైల్వే జోన్ కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించారు. అయితే పదేళ్లు దాటినా ఇంతవరకు ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం, ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామ్యం కావడంతో కదలిక వచ్చింది.