గద్దర్ భావజాలాన్ని యావత్ మంత్రిమండలి నమ్ముతోందని తెలంగాణ డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రజా గాయకుడు గద్దర్ 77వ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకలో పాల్గొన్న భట్టి మాట్లాడుతూ గద్దర్ గౌరవాన్ని ఆకాశాన్నంటే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అందరూ చదువుకోవాలన్న ఆలోచన ప్రకారమే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిందని భట్టి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆయన భావజాలాన్ని అందించడానికి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్. తత్వానికి సరి హద్దులు లేకుండా అనేక తత్వాలను దాటి ఆలోచన చేసిన గొప్ప మేధావి గద్దర్ అని డిప్యూటీ సీయం తెలిపారు. గద్దర్ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మనందరి అదృష్టం, గర్వకారణమని చెప్పారు. దశాబ్ద కాలంగా అవార్డులు మరిచిన సినిమా కళాకారులకు వచ్చే ఉగాదిన గద్దర్ పేరిట అవార్డులు ప్రధానం చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని పాటగా మార్చి ప్రజలను ఉద్యమాల వైపు నడిపించిన గొప్ప కవి, గాయకుడు గద్దర్ అని భట్టి విక్రమార్క చెప్పారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటతో యావత్తు తెలంగాణను కదిలించి, ఉద్యమంలో నడిపించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు వేసిన గొప్ప పోరాట యోధుడు గద్దర్ అని భట్టి కొనియాడారు. మా వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ కోసమే మా పార్టీ పుట్టిందని చెప్పుకునే వారి కంటే ముందే తెలంగాణ కోసం పోరాడింది గద్దర్ అని అన్నారు. గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వకపోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అది దేశాన్ని కాపాడుతుందని బలంగా గద్దర్ నమ్మాడని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారే గద్దర్ పై తప్పుడు ప్రచారం చేస్తారని భట్టి విమర్శించారు.