వర్తమాన సంవత్సరంలో ఇప్పటి వరకూ విమానాలకు 994 బాంబు బెదిరింపులు వచ్చాయని కేంద్ర విమానయాన సహాయమంత్రి మురళీధర్ మోహోల్ లోక్ సభకు తెలియజేశారు. ఈమధ్య కాలంలో తరచు పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తుండటంతో ఈ అంశంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయమంత్రి మురళీధర్ ఈ సంవత్సరంలో 994 బూటకపు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం ఈ బెదిరింపులు విపరీతంగా పెరిగాయిన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బెదిరింపులకు పాల్పడుతున్న వారి లోకేషన్ గుర్తించడం కష్టమవుతోందని అందువల్ల దర్యాప్తు ఆలస్యమవుతోందన్నారు. ఈ బెదిరింపులపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ పర్యవేక్షణ చేస్తోందని చెప్పారు. విమానాశ్రయాలకు వచ్చే బాంబు బెదిరింపులను దర్యాప్తు చెయ్యడానికి బాంబ్ త్రెట్ అసెస్మెంట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సభకు తెలిపారు.