లగచర్ల రైతుల వ్యవహారం మొదటినుంచీ వివాదాస్పదమవుతోంది. తొలిరోజు దాడి జరిగిన సంఘటన నుంచి మొదలుకొంటే ప్రతీ అంశంపైనా చర్చ జరుగుతోంది. ఇప్పుడు లగచర్ల రైతును ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు బేడీలు వేయడం కలకలం రేపుతోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు కూడా వస్తున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి చెందిన రైతు ఈర్య నాయక్ అనారోగ్యంతో బాదపడుతుంటే ఆసుపత్రికి బేడీలు వేసి తీసుకెళ్లడం దుర్మార్గమన్న విమర్శలు వస్తున్నాయి. అసలు రైతు హీర్యానాయక్ తీవ్రవాదా? ఉగ్రవాదా? ఇంకేమైనా దేశద్రోహం కేసులో నిందితుడా? అని ప్రశ్నిస్తున్నారు. లగచర్ల ఘటనలో రేవంత్ సర్కారు రైతులను హింసిస్తోందని ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. 30 రోజులుగా 45 మంది రైతులు జైల్లో మగ్గుతున్నా రేవంత్ కనికరం చూపించడం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో రైతు సంక్షేమం.. సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతులను హింసిస్తూ సంతోషపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని నిలదీస్తున్నారు.
అయితే, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. లగచర్ల రైతు హీర్యా నాయక్ ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని సీఎం హెచ్చరించారు.