పద్ధెనిమిదేళ్లకే ప్రపంచ ఛెస్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్న దొమ్మరాజు గుకేష్ స్థానికతపై ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చిచ్చర పిడుగు తమ రాష్ట్రం వాడంటే తమ రాష్ట్రం వాడంటూ ఆంధ్ర, తమిళనాడు ఆన్ లైన్ లో యుద్ధం చేస్తున్నాయి. తమిళనాడుముఖ్యమంత్రి స్టాలిన్ గుకేష్ తమ వాడేనంటుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుకేష్ తెలుగువాడంటూ ఎక్స్ లో క్లెయిమ్ చేసుకుంటున్నారు.
నిన్న సాయంత్రం ఏడున్నరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రపంచ ఛెస్ చాంపియన్ షిప్ గెలిచి గుకేష్ ప్రపంచ పటంపై తమిళనాడు స్థానాన్ని సుస్ధిరం చేశాడంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. గుకేష్ విజయంపై యావత్ తమిళ జాతి గర్వపడుతోందంటూ తాను గుకేష్ కు మెడలో పతకాన్నివేస్తున్న ఫొటోను స్టాలిన్ షేర్ చేశారు. ఆ తర్వాత రెండు నిమిషాలకే ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు బిడ్డ గుకేష్ కు హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. గుకేష్ విజయంతో దేశం గర్విస్తోందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
గుకేష్ ఎక్కడివాడు?
దొమ్మరాజు గుకేష్ ఏ ప్రాంతం వాడంటూ ఆన్ లైన్ లో గూగుల్ సెర్చ్ ఇంజన్ కు పని చెప్పారు ఛెస్ అభిమానులు. గుకేష్ తెలుగు మూలాలు కలిగిన తమిళియన్.. తల్లి దండ్రులు ఇద్దరూ వైద్య వృత్తికి చెందిన వారే. చిన్నప్పటి నుంచే గుకేష్ ఛెస్ పై ఆసక్తి చూపడం 8 ఏళ్ల వయసుకే ఫైడ్ రేట్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో తల్లి దండ్రులు అతనికి శిక్షణ ఇప్పించారు.
సీఎంల స్థాయిలో గుకేష్ స్థానికతపై వివాదం చెలరేగడంతో ఇప్పుడు గుకేష్ ట్రెండింగ్ గా మారాడు. అయితే తమిళనాడు గుకేష్ ఆటలో మరింత ఎదిగేందుకు అవసరమైన సాయం చేసిందని గతంలోనే రూ.75 లక్షలు సాయం కూడా అందించిందని తమిళనాడు క్రీడాభిమానులు ఎక్స్ వేదికగా సమాచారం షేర్ చేస్తున్నారు.
దాంతో ట్విట్టర్ వేదికగా గుకేష్ ఎక్కడి వాడంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
గుకేష్ తెలుగువాడేనని కానీ తమిళనాడు ప్రభుత్వం టాలెంట్ ను ఎంత ప్రోత్సహిస్తోందో ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు తెలుసుకుని అడుగులేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.గుకేష్ మావాడే అన్న ఓ తమిళియన్ కామెంట్ కు భాష ఆధారంగా స్థానికత గురించి మాట్లాడాలని, ఇక్కడ ఏ రాష్ట్రం అన్నది ముఖ్యం కాదని ఓ తెలుగు నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా తెలుగు మూలాలు కలిగిన అమెరికన్ అని కూడా ఆ నెటిజన్ వివరించాడు.
గుకేష్ విజయం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అంటూ ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలనుకోట్ చేస్తూ మరో నెటిజన్ కామెంట్ పోస్టు చేశాడు. ఇలా గుకేష్ నేటివిటీ పై ట్విట్టర్ లో ఓ రేంజ్ లో మోత మోగుతోంది.
మరోవైపు గుకేష్ విజయం సాధించిన సమయంలో ఆయన తండ్రి భావోద్వేగాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.