ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోనే కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో స్పష్టంగా తెలియజేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా.. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాల గురించి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్న రేవంత్.. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించామని కూడా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ సమస్య మాదిరిగానే ఈ సమస్య కూడా జఠిలం అయిందన్నారు. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మాదిగల వాదనలో బలం ఉందని, మీకు న్యాయం చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు రేవంత్. అయితే, న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేసామని వివరించారు. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించామన్నారు. మరో వారం రోజుల్లో ఆ నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని మహిళా అధికారిని నియమించామన్నారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ వీసీగా, విద్యా కమిషన్ మెబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామని వెల్లడించారు. అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామన్న రేవంత్.. తమ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం జరగనివ్వదన్నారు. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.