28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

మత్స్యకార రంగంలో తెలంగాణ భేష్

తెలంగాణ రాష్ట్రం 2024 సంవత్సరానికి ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ అవార్డును గెలుచుకుని గర్వంగా నిలిచింది. ఈ అవార్డు 2024లో మత్స్యశాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు మరియు అభివృద్ధి దృష్టికోణాన్ని గుర్తించి, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పశు సంవర్ధక, మత్స్య మరియు పాడి పరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీలో నిర్వహించిన ఘన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఈ అవార్డును మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక ఆల అందుకున్నారు.ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి అధికారికంగా అందించారు.
ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణ మత్స్యశాఖ దేశంలో అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రంలో 5,901 మత్స్య సహకార సంఘాలు 4,13,120 సభ్యులతో పనిచేస్తున్నాయి. డిసెంబర్ 2023 నుండి 225 కొత్త సంఘాలను ఏర్పాటు చేసి, 8,069 కొత్త సభ్యులను చేర్చడం ద్వారా సహకార సంఘాల విస్తరణను బలోపేతం చేసింది. బీమా పథకంలో 4.16 లక్షల మత్స్యకారుల జీవితాలను కాపాడటానికి రూ.139.77 లక్షల ప్రీమియం చెల్లించి ఆదర్శంగా నిలిచింది. కొత్త మత్స్య కుంటల నిర్మాణం కోసం రూ.2145.44 లక్షల వ్యయంతో 195.94 హెక్టార్లకు అనుమతులు మంజూరు చేయబడింది.
మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద కొర్రమీను చేపల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ అక్వాకల్చర్ సహకారంతో ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో ఆధునిక మత్స్య మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. “ఇందిరా మహిళ శక్తి” పథకంలో 32 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లను 60% సబ్సిడీతో మహిళా సంఘాలకు అందచేయనున్నారు. ఈ ఏడాది 4.56 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తితో రూ.7059.04 కోట్ల ఆదాయాన్ని సాధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యరంగం కీలక పాత్ర పోషించింది. ఈ విజయాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో మత్స్యరంగంలో నూతన ఒరవడులను సృష్టించి అగ్రస్థానంలో నిలిచింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com