– డీ లిమిటేషన్ కోసమేనా?
ఒకరు లేక ఇద్దరు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన సంతాన నియంత్రణ ప్రచారానికి నెమ్మదిగా తెరపడుతోందా?తాజాగా తెలంగాణలో కూడా ఈ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధిక జనాభాని నియంత్రించడానికి ఇద్దరికన్నా ఎక్కువ మంది సంతానాన్ని కంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ గతంలో చేసిన నిర్ణయాన్ని తొందరలోనే ఉపసంహరిస్తారని తెలుస్తోంది. కొద్ది వారాల క్రితం ఏపీలో పంచాయతీ రాజ్ చట్టంలోని ఈ నిబంధనని తొలగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఏపీలో ఇటీవల ఈ నిబంధనని తొలగించడంతో, తెలంగాణలో కూడా ఈ నిబంధనకి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు సమాచారం. జనాభా నియంత్రణ వల్ల దేశంలోనూ, రాష్ట్రాల్లోనూకూడా యువతరం సంఖ్య తగ్గిపోయి వ్రుధ్ధుల సంఖ్య పెరుగుతోంది.2047 నాటికి మన దేశంలో గణనీయంగా యువతరం తగ్గిపోతుందని జనాభా పాలసీ అధికారులు చెబుతున్న మాట.వ్రుద్ధులను ఆదుకునేందుకు, వారికి సర్వీస్ చేయడానికి కూడా యువతరం లేకపోవడం ప్రమాద సూచకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దాంతో తెలంగాణలో జనాభా సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువ పెంచేందుకు వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను తొలగించాలని ఆలోచిస్తున్నారు.
గతంలో ఏపీ ప్రభుత్వం ఎక్కువ మందిని కన్న వారికి యూరోపియన్ దేశాల్లో లాగే ప్రోత్సాహకాలు ఉంటాయని ప్రకటించింది.ఏపీలో సంతానోత్పత్తి గణనీయమైన సంఖ్యలో తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దేశంలో సంతానోత్పత్తి రేటు 2.11 శాతం ఉండగా ఏపీలో కేవలం 1.5శాతం గానే ఉంది. ప్రుభుత్వాలు తీసుకుంటున్న ఈనిర్ణయాలతో నిజంగా వ్రుద్ధతరం తగ్గుతుందా? అంటే అదేం లేదు.కానీ తెలుగు రాష్ట్రాలు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశాలేంటి?
పాలసీ ఉపసంహరణ అందుకేనా?
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కథ వేరే ఉంది. 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి రానుంది. నియోజక వర్గాల పునర్విభజన పైనే అన్ని పార్టీలు ద్రుష్టి పెట్టాయి. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ డీలిమిటేషన్ కోసమే తెలుగు రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాయి.
వాస్తవానికి ఫామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ని కఠినంగా అమలు జరుపుతున్నది దక్షిణాది రాష్ట్రాలే. ఉత్తరాది వారికంటే ఎక్కువ పన్నులు కడుతున్నా.. అరకొర సాయం విదిలిస్తూ సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్న కేంద్రం వైఖరితో రేపు డీలిమిటేషన్ లో కూడా అన్యాయం జరుగుతుందని దక్షిణాది పార్టీలు కలవరపడుతున్నాయి. ఎక్కువ మంది జనాభా ఉంటే నియోజక వర్గాలెక్కువ వస్తాయని, చట్ట సభలో సీట్ల సంఖ్య పెరుగుతుందన్నది అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. సీట్లు ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఏర్పాటు నుంచి కీలక బిల్లుల ఆమోదం వరకూ ఎంపీల సంఖ్య ఎక్కువ ఉన్న వారిదే పై చేయి అవుతుంది.ఉత్తరాదికి మనకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టే జాతీయ పార్టీలు సాధారణంగా దక్షిణాదిని పెద్దగా పట్టించుకోవు. దక్షిణాదిన అన్ని ప్రాం తీయ పార్టీలదే దాదాపు ఇదే అభిప్రాయం. డీలిమిటేషన్ లో అన్యాయం జరిగితే ఊరుకోబోమని ఉద్యమిస్తామని తెలంగాణలో ప్రధానప్రతిపక్షం బీఆరెస్ కూడా ప్రకటించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.జనాభా నియంత్రణ విషయంలో బీజేపి, దాని అనుబంధ సంస్థ ఆర్ ఎస్ ఎస్ ది కూడా అధిక సంతానాన్నికనాలనే. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా గతంలో హిందువులు ఎక్కువ సంతానాన్ని కనాలని, యువతను దేశ రక్షణకు పంపించాలనీ పిలుపునిచ్చారు. హిందువులంతా కనీసం ముగ్గురు పిల్లల చొప్పున కనాలని ఆయన అభిప్రాయపడ్డారు.
1998 ,2002 మధ్యకాలంలో అధిక జనాభా వల్ల ఆర్ధిక ప్రగతి మందగిస్తోందని ఆర్ధిక వేత్తలు హెచ్చరించడంతో జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.ఆర్ధిక ప్రగతి 2.1కన్నా తగ్గిపోకుండా ఉండాలంటే మన సమాజంలో కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేయాలని తేల్చారు.1981,1991 మధ్యకాలంలో మనం అనుసరించిన జనాభా నియంత్రణ విధానాలతో ఫలితాలు అంతంతమాత్రమని తేలిపోయింది. జనాభా నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కమిటీని వేసింది. దీనికి అప్పటి కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ అధ్యక్షత వహించారు. జనాభా నియంత్రణకోసం ఇద్దరికన్నాఎక్కువమంది సంతానం ఉన్న వారు పంచాయతి నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ ఎందులోనూ పోటీ చేయడానికి పనికి రారనే చట్టం చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. అప్పటినుంచి ఈ సిఫారసునే రాష్ట్రాలు అమలు చేస్తూ వచ్చాయి. ఈ సిఫారసులను 13 రాష్ట్రాలు అమలు చేశాయి. రాజస్థాన్ అందరికన్నా ముందు 1992 లోనే ఈ నిబంధనలను అమలు చేసింది. ఆ తర్వాత 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు అమలు చేశాయి.అయితే ఛత్తిస్ గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ 2005లోనే ఈ పాలసీని ఉపసంహరించుకున్నాయి. కొద్ది వారాల క్రితం ఏపీ ఈ విధానానికి స్వస్తి చెప్పింది. ఇప్పుడిక తెలంగాణ కూడా తప్పుకుంటే ఈ పాలసీని ఉపసంహరించుకున్న ఆరో రాష్ట్రం అవుతుంది. 2026లో నియోజక వర్గాల పునర్విభజన జరిగితే పార్లమెంటు ముఖ చిత్రమే మారిపోతుంది. అందుకే అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి.