తెలంగాణ ట్రాన్స్ కో అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ప్రతిష్టాత్మకమైన “ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు”ను గెలుచుకుంది. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో ప్రతిష్టాత్మక “ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2024” గెలుచుకుంది. ఈ అవార్డును నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ – గ్రిడ్ ఇండియా, ఫోరమ్ ఆఫ్ లోడ్ డిస్పాచ్‌ర్స్ అందజేశాయి.
డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ వివరాలను వెల్లడించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు సాధించినందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులను శుక్రవారం సాయంత్రం ప్రజభవన్ లో అభినందించారు. ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులు అమలు చేయడం, ఆధునిక సాంకేతికతను అనుసరించడం వల్ల ఈ అవార్డు సాధ్యమైందని అన్నారు. గత సంవత్సరం విద్యుత్ రంగంలో సాధించిన విజయాలకు ఇది మరో సమున్నత గౌరవమని పేర్కొన్నారు.
అలాగే, ఆర్థిక మరియు ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, విద్యుత్ సంస్థల టీం ను అభినందించారు.
తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, టిజీట్రాన్స్‌కోను 2024లో బెస్ట్ ఎస్‌ఎల్‌డీసీ అవార్డు విజేతగా ఫోరమ్ ఆఫ్ లోడ్ డిస్పాచర్స్ (FOLD) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును డిసెంబర్ 14, 2024న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ విద్యుత్ వ్యవస్థ సదస్సు సందర్భంగా తెలంగాణ విద్యుత్ విభాగానికి అందజేస్తారు.