రంగారెడ్డి జిల్లాలోె ఓ మృత్యు వాహనం పది మంది ప్రాణాలు బలిగొంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా కూరగాయలు అమ్ముకుంటున్న వారేనని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ -బీజాపుర్ రహదారి మీద ప్రతిరోజు సుమారు దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుంటారు. ఈ రోజు జరిగిన ఘటనలో సుమారు 50 మందికి కాళ్లు, చేతులు విరగడంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. బాధితులంతా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక లారీ వేగానికి అక్కడున్న ఓ భారీ వృక్షం కూడా కుప్పకూలింది. లారీ క్యాబిన్‌లో డ్రైవర్ చిక్కుకున్నాడు. లారీ వేగాన్ని చూసి స్థానికులు పరుగులు పెట్టారు.