పెర్త్‌లో కింగ్స్‌గా నిలిచిన టీమ్ ఇండియా.. అడిలైడ్‌లో తేలిపోయింది. దీంతో ఏకంగా టెస్ట్ ర్యాకింగ్స్‌లో మూడో ప్లేస్‌కు పడిపోయింది. దీంతో గబ్బాలో జరిగే మూడో టెస్ట్‌లో తన సత్తా చాటాలని చూస్తోంది. అందుకే నాన్ స్టాప్‌గా ప్రాక్టీస్ చేస్తోంది టీమ్ ఇండియా. బ్రిస్బేన్ వేదికగా ఈ నెల 14 నుంచి జరగనుంది మూడో టెస్ట్. దీంతో కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇక బౌలర్లు ఆకాశ్‌దీప్‌సింగ్, యశ్ దయాల్, హర్షిత్‌రానా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఫామ్‌లేమితో నానా ఇబ్బందులు పడుతున్న కెప్టెన్ రోహిత్‌శర్మ ఎక్కువసేపు నెట్స్‌లో గడిపాడు. ఇక పెర్త్ టెస్టులో సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ ఎడ్జింగ్ డెలీవరీలు ఎలా ఎదుర్కొవాలో ప్రాక్టీస్ చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎక్కువగా డిఫెన్స్‌కు ప్రాధాన్యమివ్వగా, వికెట్‌కీపర్ రిషబ్ పంత్ భారీ షాట్లు ఆడాడు. పెర్త్ టెస్టులో సూపర్ సెంచరీతో కదంతొక్కిన జైస్వాల్ ఎక్కువ సేపు నెట్స్‌లోనే గడిపాడు.
ఇక మూడో టెస్ట్ జరిగే గబ్బా స్టేడియంలో ఈసారి పిచ్ పూర్తిగా పేస్‌కు అనుకూలంగా ఉండనుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. క్రిస్మస్ తర్వాత కాకుండా వేసవి ఆరంభం మ్యాచ్ జరుగుతున్నందున గబ్బాలో పిచ్ ఎప్పటిలాగే పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. పంత్ సూపర్ ఇన్నింగ్స్‌తో కిందటిసారి ఇక్కడ భారత్ అద్భుత విజయాన్నందుకుంది. అయితే అప్పుడు మ్యాచ్ జనవరిలో జరిగింది. 1988 తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే తొలిసారి. దీంతో ఆ మరకను తొలగించుకోవాలని చూస్తోంది ఆసీస్ టీమ్. ఏదేమైనా గబ్బాలో గెలవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి.