రాష్ట్రంలో పరిస్ధితులపై ఎంపీలకు అవగాహన కల్పించన భట్టి
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన సంవత్సర కాలంగా అన్నీ మంచి కార్యక్రమాలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గురువారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సమావేశం అనంతరం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు సమావేశ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఎంపీలుగా మాకు అవగాహన ఉండాలనే డిప్యూటీ సీయం అన్నీ వివరంగా తెలియచెప్పారని చామల మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని అంశాలపై ఈ సమావేశంలో డిప్యూటీ సీయం ఎంపీలకు స్పష్టత ఇచ్చారన్నారు. ఆర్థిక మంత్రిగా, డిప్యూటీ సీయం హోదాలో రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలన్నింటినీ మాకు తెలియజేశారని చామల కిరణ్ చెప్పారు. మన ప్రభుత్వం చేస్తున్న అన్ని మంచి కార్యక్రమాలను ప్రచారం చెయ్యడంలో ఎంపీలు కూడా భాగస్వామ్యం కావాలని డిప్యూటీ సీయం కోరినట్లు తెలిపారు. ఇక రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హస్యాస్పదమన్నారు చామల. అప్పులలో మునిగి ఉన్న రాష్ట్రంలో అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనను చూసి ఓర్వలేలక కేటీఆర్, హరీష్ రావులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాసేదేంది ఆయనకు అన్నీ తెలుసు అని చామల వ్యాఖ్యానించారు.