హైదరాబాద్ మణికొండ సమీపంలో భారీ బ్లాస్టింగ్స్ కలకలం సృష్టించాయి. వరుసగా బాంబుల మోతతో పాటు.. రాళ్లు గాలిలో ఎగిరొచ్చి సమీప ప్రాంతాల్లో పడటం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోకాపేట నియోపోలీస్ ప్రాంగణంలో గురువారం ఉదయం బ్లాస్టింగు బాంబుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఏక కాలంలో పది బ్లాస్టింగులు జరగడంతో చుట్టు పక్కల ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. కోకాపేట నియోపోలీస్‌లో ప్లాట్ నం.3లో నిర్మాణ పనుల్లో భాగంగా గురువారం నిర్మాణ సంస్థ డిటోనేటర్లతో పదిచోట్ల బ్లాస్టింగులు చేసింది. ఈ పేలుళ్లతో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు శబ్దం రావడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆటోలు, జేసీబీలు, పక్కనే శివాలయంలో ఉన్న అయ్యప్పస్వాములంతా పరుగులు పెట్టారు. పేలుడు తీవ్రతకు రాళ్లు ఎగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పడ్డాయి. గాలిలో రాళ్లను చూసి స్థానికులు దూరంగా పరుగులు పెట్టారు. సినిమా షూటింగ్ మాదిరిగా గాల్లోకి రాళ్లు లేవడం భయభ్రాంతులకు గురిచేసింది. కొందరైతే ఆ దృశ్యాలు చూసి ఏదైనా సినిమా షూటింగేమో అనుకున్నారు. ఈ ప్రమాదంలో ఓ ఇటాచీ, ఆటో, ఓ గుడిసె పూర్తిగా ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న అయ్యప్పల శిబిరంపై రాళ్ల పెంకులు ఎగిరిపడటంతో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, క్యాంప్‌లో ఉన్న కార్మికులు, అయ్యప్పస్వాములకు ప్రాణాపాయం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వారం రోజులుగా బ్లాస్టింగుల వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో చేస్తున్నారని తెలిసింది. గురువారం తెల్లవారు జామున పేల్చాల్సిన బ్లాస్టింగులు ఉదయం పదిగంటల సమయంలో పేల్చడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ బ్లాస్టింగులకు ఏ మేరకు అనుమతులున్నాయనే దానిపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి చోట్ల అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత బ్లాస్టింగులకు అనుమతులివ్వాలని, లేకపోతే తమ ప్రాణాలకే ప్రమాదంగా మారిందంటూ ఖానాపూర్, కోకాపేట వాసులు కోరుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బ్లాస్టింగులు చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. పట్టపగలు బ్లాస్టింగ్ చేయడం, జనంలో భయాందోళన రేకెత్తించడంపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్‌తో పాటు.. బీఎన్‌ఎస్ 125, 91బి సెక్షన్ల కింద కేసులు పెట్టారు.