బీఆర్‌ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది కరీంనగర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనదని కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ పదవులు ఆశించకుండా తెలంగాణ కోసం కృషి చేశారని, కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు అని పేర్కొన్నారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాధించామని తెలిపారు. కానీ ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్లు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆనాడు ఉద్యమంలో మన మీదకు తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా దగ్గర అడుక్కుతినే వాళ్లని తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు. ఆఖరకు గురుకులాల్లో ఉండే పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. హాస్టల్‌లో బువ్వ తిని ఆస్పత్రి పాలయ్యే పరిస్థితి ఉందని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులు తిండి కోసం అలమటిస్తున్నారన్నారు. వచ్చే నాలుగేళ్లు ప్రజల పక్షాన ఉద్యమిద్దామని బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.