తెలంగాణలో నియంతృత్వ పోకడలను పూర్తిగా రూపు మాపి.. ప్రగతి పయనంలో ప్రజలకు సేవలందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కుటిల ప్రయత్నాలను తట్టుకొని మరీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం తెలంగాణ లక్ష్యసాధనలో ఓ ప్రధానాంశం అయినా.. బీఆర్‌ఎస్ హయాంలో ఆ ఆశయాన్ని అటకెక్కించారని మండిపడ్డారు.
తమ ప్రజా ప్రభుత్వం జనంతో మమేకమవుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటోందన్నారు. ప్రజావాణితో పార్టీ భావజాలాన్ని నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎప్పుడూ గడీల మధ్యనే ఉండి పాలన చేసిందని దుయ్యబట్టారు. విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని భట్టి చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు 40శాతం పెంచి అందిస్తున్నామని, అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి.. 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని విక్రమార్క చెప్పారు. పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక గాలికి వదిలేశారని ఆరోపించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీని ప్రభుత్వం కడుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, కుల గణన చారిత్రాత్మక విజయమని.. దేశానికి తెలంగాణ మోడల్‌గా కులగణన నడుస్తోందని చెప్పారు. కుల గణనను అడ్డుకునేందుకు కొందరు దోపిడీదారులు ప్రయత్నం చేస్తున్నారన్న ఉప ముఖ్యమంత్రి.. వనరులు ప్రజలకు సమానంగా పంచాలని కోరుకునే వాళ్లందరూ కులగణనకు మద్దతు ఇవ్వాలని కోరారు.