కులగణనకు చట్టబద్దత ఉందోలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి డెడికేటెడ్ కులగణన కమిషన్‌కు 35 పేజీలతో తెలంగాణ జాగృతి ఆధ్యర్యంలో చేపట్టిన సమగ్ర నివేదికను కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసిందన్నారు. బీజేపీ ద్వంద వైఖరిని బీసీలు ఖండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో డెడికేటెడ్ కమీషన్ రిపోర్ట్ ఎట్లా ఇస్తుందని, కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలని కవిత అన్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా కులగణన నిర్వహిస్తున్నట్టుగా అనుమానం వస్తోందన్నారు.