ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య శాంతి ఒప్పందం తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు 725 మిలియన్ డాలర్ల ఆయుధ సాయం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్యాకేజీలో ల్యాండ్ మైన్స్, డ్రోన్లు, స్ట్రింగర్ మిసైళ్లతో పాటు హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ (హెచ్‌ఎమ్‌ఏఆర్‌ఎస్)ను అందించనున్నారు. ఇందులో క్లస్టర్ ఆయుధాలు సైతం ఉన్నాయని సమాచారం.
అధ్యక్షుడు బైడెన్ పదవీ కాలం జనవరిలో మగియనుంది. దీనికి ముందే ఉక్రెయిన్‌ను బలోపేతం చేయాలనే లక్ష్యం ఆయన తీసుకునే నిర్ణయాల్లో కనిపిప్తోంది. అంతేకాదు ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ అథారిటీ (పీడీఏ) అని పిలిచే అధికార ఆయుధ నిల్వల కేంద్రంలో ఆయుధాలను ఇటీవలకాలంలో బైడెన్ ఎక్కువగా వినియోగించినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా మిత్ర దేశాలకు సాయం చేసేందుకు పీడీఏలోనే ఆయుధాలను నిల్వ చేస్తారు.
అమెరికా దశాబ్దాలుగా ల్యాండ్‌మైన్స్ తయారీని ఆపేసినట్లు ప్రకటిస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు అందించే ప్యాకేజీలో అవి కూడ ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌కు అందించేవి ఇప్పటికే తమ ఆయుధాగారాల్లో ఉన్న నిల్వలని అగ్రరాజ్యం చెబుతోంది. సాధారణంగా యుద్ధం ముగిసిన తర్వాత మందుపాతరలు భూమిలో నుంచి తొలగించకపోతే.. ప్రజలు చనిపోవడమో.. అవయవాలు కోల్పోడమో జరుగుతుంది. కానీ ప్రస్తుతం అందిస్తున్న ల్యాండ్ మైన్స్ వాటంతటవే నిర్వీర్యం అయ్యేలా టైమ్ సెట్ చేసుకొనేలా తయారుచేసినట్లు చెబుతోంది అమెరికా. వీటిల్లో బ్యాటరీ ఆధారంగా నాలుగు గంటల నుంచి రెండు వారాల వరకు మాత్రమే ఇవి యాక్టివ్‌గా ఉంటాయని చెబుతోంది.
ఏదేమైనా అమెరికా అధ్యక్షుడి చర్యలు భిన్నంగానే ఉన్నాయని చెప్పాలి. ఇజ్రాయెల్ కోసం శాంతి ఒప్పందం ఓ వైపు. మరోవైపు ఉక్రెయిన్ కోసం ఆయుధాలు అందించడం అగ్రరాజ్య ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.