ఆంధ్రప్రదేశ్‌లో మసీదుల్లోని ఇమామ్‌లకు, మ్యూజిన్‌కు గౌరవ వేతన పథకాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని 5వేల మసీదులకు ఈ ఆర్థిక సహాయం పథకం అమలు చేయనున్నారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం గురువారం జీవో నెంబర్ 131 విడుదల చేసింది. ఆదాయం లేని మసీదుల ఇమామ్‌లకు, మ్యూజిన్‌లకు ప్రతినెలా గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఒక్కో మసీదుకు రూ.15000 చొప్పున గౌరవ వేతనాన్ని అందించనున్నారు. ఇమామ్‌లకు రూ.10వేలు, మ్యూజిన్‌లకు రూ.5వేల చొప్పున ఈ ఆర్థిక సహాయం పంపిణీ చేస్తారు. ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి రూ.90కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ పథకం గత ఏప్రిల్ నుంచే అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. మైనారిటీ సంక్షేమ శాఖ కమిసనర్, స్టేట్ వక్ఫ్‌బోర్డ్ ఈ పథకం అమలుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జారీచేసిన జీవోపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ హయాంలోనే ఈ పథకం ప్రారంభమయ్యింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిధుల విడుదల నిలిపేశారు. అప్పటినుంచి మసీదుల నుంచి, ఇమామ్‌ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ పథకం ఇక చెల్లుచీటీయే అని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా రాష్ట్రప్రభుత్వం ఉన్నట్టుండి జీవో జారీ చేసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మమంటూ కొత్త నినాదం ఎత్తుకొని బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యింది. అలాగే, హిందూ ధర్మానికి తామే వారసులమంటూ చెప్పుకునే బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే, బయటకు పార్టీశ్రేణులను రెచ్చగొడుతూ, నిర్ణయాలు మాత్రం తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్నారంటూ ఈ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.